టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు ఈరోజు ఉదయం నాలుగు గంటలకు ఆయన ఫిలింనగర్ లోని నివాసంలో తుది శ్వాస విడిచారు.
ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రామ్ చరణ్, నందమూరి కళ్యాణ్ రామ్, బాలకృష్ణ గారు సోషల్ మీడియాలో సందేశాలు పంపారు.
సత్యనారాయణ గారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో సత్యనారాయణ గారు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు.
1959లో ‘సిపాయి కూతురు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన చివరిసారిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో కనిపించారు. అంతే కాకుండా దాదాపు 770 కి పైగా చిత్రాలలో నటించారు. ఆయన తండ్రి పేరు కైకాల లక్ష్మీనారాయణ.
సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లా, కౌతవరం మండలం గుడ్లవల్లూరు. కైకాల సత్యనారాయణ తన ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక విద్యను గుడివాడ, విజయవాడ, గుడివాడ కళాశాలలో పూర్తి చేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు.
1960, ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో కైకాల సత్యనారాయణ గారికి వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. 1996లో రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి 11వ లోక్ సభకు ఎన్నికయ్యారు.
రేపు మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆ మహానటుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.