మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లలో, మాస్ మహారాజా రవితేజ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా పట్ల ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి మరో సంచలన వార్త బయటకి వచ్చింది. మెగా154 లో నాగార్జున, వెంకటేష్ కూడా భాగమవుతారని ఇండస్ట్రీలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల నివేదికల ప్రకారం, నాగార్జున మరియు వెంకటేష్ పోషించే పాత్రలు చిన్నవే అని తెలుస్తోంది. కాగా మాస్ మహారాజ్ రవితేజ పాత్ర కంటే పెద్దవి అయితే కావు కానీ వారిరువురి పాత్రలు సినిమాకు చాలా కీలకం అని తెలుస్తోంది.
ఈ వార్తలు గనక నిజమైతే, ఈ సినిమా ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే మరింత భారీ స్థాయికి చేరుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళ కెరీర్ లో మెగాస్టార్ చిరు, వెంకటేష్, నాగార్జున మరియు బాలయ్యతో సహా తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్ర హీరోలు, లేదా స్టార్ హీరోలు ఎప్పుడూ కలిసి ఒక చిత్రం కోసం ఒకరితో ఒకరు కలిసి నటించలేదు. అలా జరగకపోవడానికి వారి అభిమానుల ఇగో కూడా ఒక కారణం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సీనియర్ హీరోలు ప్రస్తుతం హద్దులు చెరిపివేయాలి అనుకుంటున్నారు. అయితే అందరిలోకి ముందుగా వెంకటేష్ మాత్రమే అలాంటి మల్టీస్టారర్‌లలో కలిసి నటించడం మొదలు పెట్టి ఇప్పటికీ ఆ పద్ధతిని కొనసాగిస్తున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున ఈ ముగ్గురూ కలిసి ఒకేసారి వెండి తెర పై కనిపిస్తే.. అది కొద్ది క్షణాలైనా సరే టాలీవుడ్‌లో ఎప్పుడూ లేనంత క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ ఇటీవలే చిత్ర షూటింగ్‌లో పాల్గొని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణలో భాగమయ్యారు. అంతే కాకుండా ఈ సినిమాలో శృతి హాసన్, కేథరిన్ థ్రెసాలతో పాటు బాబీ సింహా కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు.