చిత్రం : వాశి (Vaashi)
నటీనటులు: టోవినో ధామస్, కీర్తీ సురేష్, కొట్టాయం రమేష్, మాయా విశ్వనాథ్, రోని డేవిడ్, బైజు తదితరులు.
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: విష్ణు జీ రాఘవ్
కథ: జానిజ్ చాకో సైమన్
కెమెరా: రాబీ వర్ఘీస్ రాజ్
సంగీతం: కైలాస్ మీనన్
నిర్మాణం : జీ సురేష్ కుమార్
రేటింగ్ : 3/5
కథ: ఎబిన్ (టోవినో ధామస్) మాధవి (కీర్తీ సురేష్) లాయర్లుగా ప్రాక్టీస్ చేసిన స్నేహితులు. ఒకరంటే ఒకరికి ఇష్టమున్నా పైకి టామ్ అండ్ జెర్రీ లా పొట్లాడుతూ ఉంటారు. అయితే వారి మధ్య ఉన్న ప్రేమను ఒకరికి ఒకరు తెలుపుకుని పెళ్లికి సిద్ధం అయ్యే సమయంలో వారిద్దరూ కోర్టులో ఓకే కేసులో ప్రతివాదులుగా తలపడాల్సి వస్తుంది. మరి ఆ కేసులో ఎవరు గెలిచారు? అసలు ఆ కేస్ వల్ల వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది అసలు కథ.
విశ్లేషణ: కథలో రెండు ప్రధాన పాత్రల మధ్య చక్కని సంఘర్షణ ఉంది. దాన్ని తెర మీద సరైన విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు విష్ణు జీ రాఘవ్ సఫలం అయ్యారు అనే చెప్పాలి. ప్రధాన సమస్యలోకి వెళ్ళే ముందు హీరో హీరోయిన్ల మధ్య ఉన్న భందాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు పెద్దగా సమయం తీసుకోలేదు. అలాగే కోర్టు రూం డ్రామా అంటే సాధారణంగా వాద ప్రతివాదనలు అంటే ఉద్వేగభరితమైన డైలాగుల నేపథ్యంలో ఉంటాయి.
కానీ వాశి సినిమాలో దర్శకుడు ఆ చాయలకు పోకుండా సున్నితమైన పొరలా భావోద్వేగాలను పండించారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న యువతి యువకులు ప్రేమ,, సెక్స్ పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు. పరిస్థితులు తమ చేయి దాటిపోయినప్పుడు వారు కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, ప్రవర్తించిన తీరు వల్ల ఎలాంటి సమస్యలు దారి తీస్తాయి అనే అంశాలను చక్కగా చూపించారు.
లైంగిక వేదింపులు ఆరోపింబబడ్డ యువకుడి తరపున హీరోయిన్.. భాదింపబడ్డ యువతి తరపున హీరో నిలబడటం వల్ల వారు వాదిస్తున్న కేసుని, సినిమాని కూడా ఒక ఆసక్తికర కోణంలో చూసే అవకాశాన్ని దర్శకుడు కల్పించారు. మొదట్లో కేసు విషయంలో వృత్తిపరంగానే తలపడే హీరో హీరోయిన్లు.. క్రమంగా కేసు గెలవడం అనే విషయాన్ని ఈగో సమస్యగా మార్చేసుకుంటారు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం వహించే తాపత్రయంలో ఒకరికి ఒకరు దూరం అయిపోయే ప్రమాదంలో పడటాన్ని దర్శకుడు ఎక్కడా ఒక పాత్ర వైపు పక్షపాతం వహించకుండా చూపించారు.
అలాగే ఆ కేసులో ఉన్న యువతీ యువకుల పాత్రల మధ్య ఉన్న సంఘర్షణను కూడా బాగా చూపించారు.
వాశి సినిమా కథ, కథనం చూస్తే గతంలో హిందీలో వచ్చిన “సెక్షన్ 375” సినిమా గురుకు వస్తుంది. అయితే అందులో ఉన్నంత భావోద్వేగాలు ఇక్కడ లేకపోయినా ముందుగానే చెప్పుకున్నట్టు దర్శకుడు పాత్రల ఉద్దేశాలను, పాత్ర చిత్రణలను సున్నితంగా స్పృశిస్తునే అప్పుడప్పుడూ బలమైన సంభాషణలు, సన్నివేశాలు పొందుపరిచారు.
నటీనటుల విషయానికి వస్తే టోవినో ధామస్ ఎబిన్ పాత్రలో చక్కగా నటించారు. అలాగే కీర్తి సురేష్ తనదైన నటనతో బలమైన ముద్ర వేశారనే చెప్పాలి. వారికి స్నేహితుడుగా, సరైన సమయంలో దిశానిర్దేశం చేస్ పాత్రలో బైజు ఆకట్టుకుంటారు. ఇక ఈ చిత్రంలో మరో ప్రధాన జంటగా కనిపించిన అను మోహన్, అనఘా నారాయణన్ తమ ఉనికిని చాటుకోగా.. జడ్జి పాత్రలో కొట్టాయం రమేష్ హుందాగా కనిపించారు.
సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. కెమెరా వర్క్ సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఉండి సన్నివేశాల్లో ఇమిడిపోయింది. అలాగే సంగీతంలో పాటలు పరవాలేదు అనిపించగా, నేపథ్య సంగీతం బాగుంది.
మొత్తంగా అభినందించదగ్గ ప్రయత్నమైన “వాశి” చిత్రానికి బలమైన కథ, పాత్రల చిత్రణ మరియు కోర్టు సన్నివేశాలు బలంగా నిలవగా.. అక్కడక్కడా కథనంలో వేగం లోపించడం, కోర్టు కేసుకు సరైన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వంటివి బలహీనతలుగా చెప్పుకోవచ్చు.