బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్స్‌తో ఈ మధ్య తెలుగులోనూ బాగా పాపులర్ అయిపోయారు. అఖిల్ అక్కినేని తాజా చిత్రం ‘ఏజెంట్’లోనూ ఈ ముద్దుగుమ్మ ఐటెం నంబర్ ఉన్నట్లు తెలుస్తుండగా.. షూటింగ్ టైమ్‌లో తనను అఖిల్ హరాస్ చేశాడన్న రూమర్స్ పై తాజాగా ఆమె స్పందించారు.
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ . ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర నిర్మించిన చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటించారు. అఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ఏప్రిల్ 28న విడుదల అవుతుండగా.. ఇటీవలే చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ స్పందన వచ్చింది.
అయితే ఇంతలో ఏజెంట్ చిత్ర యూనిట్ కు నెట్టింట్లో స్ప్రెడ్ అవుతున్న ఒక వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ మూవీలో ఐటెం సాంగ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను అఖిల్ హరాస్ (Harrassment) చేశాడనేది ఆ వార్త సారాంశం కాగా.. తాజాగా ఈ పుకార్ల పై ఊర్వశి స్పందించారు.
ఏజెంట్ సినిమా షూటింగ్‌లో అఖిల్ వల్ల ఊర్వశి అన్‌కంఫర్టబుల్‌గా ఫీలైందని.. యూరప్‌లో అఖిల్ ఆమెను వేధించాడని సోషల్ మీడియాలో తనకు తానే ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే ఉమైర్ సంధు పేర్కొనడం నెట్టింట పెద్ద సంచలనమే రేపింది. అఖిల్ మెచ్యూరిటీ లేనటువంటి నటుడని, తనతో యాక్ట్ చేసేందుకు ఊర్వశి చాలా ఇబ్బంది పడిందని ఉమైర్ సంధు వెల్లడించాడు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన ఊర్వశి.. దీని పై లీగల్ నోటీస్ దాఖలు చేసారు. తన లీగల్ టీమ్ ద్వారా పరువు నష్టానికి సంబంధించి చట్టపరమైన నోటీస్ పంపించినట్లు తెలిపిన ఊర్వశి.. ఉమైర్ యొక్క బూటకపు/హాస్యాస్పదమైన ట్వీట్ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు.
నిజానికి ఉమైర్ సంధు.. తెలుగు, తమిళ, హిందీ సినిమాల గురించి తరచూ అవాస్తవమైన వార్తలు, కథనాలు మరియు రివ్యూలు ప్రచారం చేస్తూ విమర్శల పాలవుతుంటాడు. గతంలో పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా విడుదల కాకముందే ట్విట్టర్ లో ఆ సినిమా యొక్క రివ్యూ పోస్ట్ చేసిన ఉమైర్.సుహాసిని మణిరత్నం యొక్క ఆగ్రహానికి గురయ్యాడు.