సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న SSMB28 ఈ నెల ప్రారంభంలో సెట్స్ మీదకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కథాంశానికి చాలా కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తాలూకు షూటింగ్ తో తొలి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో మహేష్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఎస్ఎస్ థమన్ అద్భుతమైన బాణీలను అందించే భాద్యతను నిర్వర్తిస్తున్నారు.
తాజా నివేదికల ప్రకారం, 2022 దసరా సందర్భంగా.. రచయిత – దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి సంభందించిన ఫస్ట్ లుక్ మరియు పోస్టర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రం పై కేవలం మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కాగా ఈ సినిమా కోసం మహేష్ కొత్త లుక్ మరియు మేకోవర్ ను షూటింగ్ మొదలయిన రోజున చిన్న విడియో గ్లింప్స్ లో విడుదల చేయగా.. దానికి విశేషమైన స్పందన లభించింది. కేవలం చిన్న విడియో లోనే అలా ఉంటే ఇక పూర్తి సినిమాలో ఇంకెంత బాగుంటుంది అన్న అంచనాతో అటు మహేష్ అభిమానులు ఇటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ చిత్ర నిర్మాతలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు గత సంవత్సరం ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులను ఆనందపరిచారు. 2023 సమ్మర్లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే.. 2006 లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులని తిరగరాసిన పోకిరి సినిమా విడుదలైన ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలి నిర్వహిస్తారు.
SSMB28 12 సంవత్సరాల తర్వాత ఈ మహేష్ – త్రివిక్రమ్ ల కలయికలో రాబోతున్న చిత్రం. కాగా అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్‌లకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. హ్యాట్రిక్ సినిమాతో మహేష్ – త్రివిక్రమ్ లు మరో బ్లాక్ బస్టర్ సినిమా అందిస్తారని ఆశిద్దాం.