మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య తాజాగా టాలీవుడ్ లో ప్రతిష్టాత్మక రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన ఓపెనింగ్ అందుకున్న ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లను కొనసాగించడంతో చాలా ఏరియాలు హౌస్ ఫుల్ గా నమోదయ్యాయి. ఎట్టకేలకు ఈ శుక్రవారం వాల్తేరు వీరయ్య 100 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది.
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 15 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో ఉండగా సైరా, ఖైదీ నెం.150 తర్వాత చిరంజీవి సినిమాల్లో ఈ ఫీట్ సాధించిన మూడో చిత్రంగా వాల్తేరు వీరయ్య నిలిచింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 4 సినిమాలు రూ.100 కోట్ల షేర్ ను క్రాస్ చేసి ఈ క్లబ్ లో అగ్రస్థానంలో నిలిచాయి. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, భరత్ అనే నేను, మహర్షి సినిమాలు ఈ మార్కును తాకాయి.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్ఆర్ఆర్, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో ఈ క్లబ్ లో తిరుగులేని లీడర్ గా నిలిచారు. ఇక సుకుమార్ చేతిలో రంగస్థలం, పుష్ప ది రైజ్ అనే రెండు సినిమాలు ఉన్నాయి.
కాగా ఈ అరుదైన 100 కోట్ల క్లబ్ లో 3 సినిమాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, చెరో రెండు సినిమాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఒక సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు.