టాలీవుడ్ దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని ఇటీవల సంక్రాంతి సీజన్ లో విడుదలైన తమ తమ చిత్రాలతో విజయాన్ని రుచి చూశారు. తాజాగా ఈ ఇద్దరు దర్శకులు తమిళ చిత్ర పరిశ్రమలోని సూపర్ స్టార్లు అయిన రజినీకాంత్, విజయ్ లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య, గోపీచంద్ మలినేని చిత్రం వీరసింహారెడ్డి ఈ సంక్రాంతికి విడుదలయ్యాయన్న అందరికీ తెలిసిందే. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కాగా, వీరసింహారెడ్డి హిట్ అయింది. ఐతే తదుపరి చిత్రాల కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ తో బాబీ, గోపీచంద్ మలినేని ఏమో దళపతి విజయ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు.
ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబంధించిన ప్రాథమిక సమావేశాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరూ మొత్తం స్క్రిప్ట్ ను పూర్తి చేసి తమ కథనంతో హీరోలను ఆకట్టుకునే పనిలో బిజీగా ఉన్నారని అంటున్నారు.
యాక్షన్, కామెడీ మిక్స్ చేసి తీసే మాస్ ఎంటర్టైనర్లకు బాబీ పెట్టింది పేరు. మెగాస్టార్ చిరంజీవిని వినోదాత్మకంగా చూపించడంలో ఆయన ఎంత సక్సెస్ అయ్యారో వాల్తేరు వీరయ్యతో అందరికీ తెలిసిందే. ఇక అచ్చం అలానే తన వింటేజ్ గ్లింప్స్ చూపించి సూపర్ స్టార్ అభిమానులను, ఇతర తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోగలరు కాబట్టి ఆయన శైలి రజినీకాంత్ కు సరిపోతుంది అనే చెప్పవచ్చు.
అదే విధంగా గోపీచంద్ మలినేని, విజయ్ కాంబినేషన్ కూడా ఆసక్తికరమైనదే. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తీయడంలో గోపీచంద్ దిట్ట అనే పేరుంది. అయితే ఈ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. త్వరలోనే అవి బయటకు రావాలని కోరుకుందాం.