తెలుగు సినిమా పరిశ్రమ అనేది ఒక చిత్రమైన పరిశ్రమగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని సంవత్సరాలకు ఒక్కోసారి పద్ధతులు, వ్యవహారాలు మారుతూ ఉంటాయి. మరియు కాలానుగుణంగా ఫార్ములాలతో పాటు సెంటిమెంట్‌లు కూడా మారుతూ ఉంటాయి. కరోనా మహమ్మారి ఒక్కసారిగా పరిశ్రమను కుదిపేసిన తర్వాత, ప్రేక్షకుల అభిరుచిలో స్పష్టమైన మార్పు వచ్చింది. అలాగే పరిశ్రమ వర్గాలలో కూడా చెప్పుకోదగిన మార్పు వచ్చిందని చెప్పవచ్చు.
ఇక తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు దర్శకులను నమ్మి స్క్రిప్ట్‌లు కూడా వినకుండా సినిమాలకు ఒప్పుకోవడం చేసేవారు. ఎందుకంటే ఫలానా దర్శకుడితో చేస్తే ఆ కాంబో క్రేజ్ వలన సినిమా చుట్టూ క్రేజ్ ఏర్పాటు చేయడానికి సహాయపడేది.
కానీ స్టార్ హీరోలు ఇప్పుడు తమ స్టార్‌డమ్ మరియు సినిమా ఫలితం గురించి ఎటువంటి రిస్క్ తీసుకోకూడదనే ఆలోచనలో ఉన్నారు. కాగా వారు పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్‌లను వివరించాలని దర్శకులను డిమాండ్ చేస్తున్నందున ఇప్పుడు కాలం మారిపోయిందనే చెప్పాలి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, స్టార్ హీరోలు ఇప్పుడు తమ కెరీర్‌లో ప్రతి సినిమా చాలా కీలకమైనదని భావిస్తున్నారు. అందుకే వారు ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి లేదా సిద్ధంగా లేరు అలాగే ఏ విధమైన రాజీ పడకూడదనుకుంటున్నారు.
సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ వంటి పెద్ద దర్శకులు కూడా ఇప్పుడు స్టార్ హీరోల తాలూకు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. షూటింగ్ సమయంలో కూడా హీరోలు ఇప్పుడు సినిమా అవుట్‌పుట్‌ని నిరంతరం పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో వారికి ఏదైనా నచ్చకపోతే వారు వెంటనే దర్శకులకు తెలియజేస్తూ వాటి పై మళ్లీ పని చేయమని అడుగుతున్నారు.
SSMB28కి సంబంధించి స్క్రిప్ట్ పై పని చేయమని త్రివిక్రమ్‌పై మహేష్ ఒత్తిడి చేస్తున్నారని ఇప్పటికే చాలా పుకార్లు వస్తున్నాయి. అలాగే, ఇండియన్ సినిమాలో అత్యంత భారీ క్రేజ్ ఉన్న పుష్ప 2 చిత్రం షూటింగ్‌కి ముందు సుకుమార్ స్క్రిప్ట్ పై అదే పనిగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
రాజమౌళి తప్ప మరే దర్శకుడిని స్టార్ హీరోలు నమ్మడానికి సిద్ధంగా లేరు. బాహుబలి ఫ్రాంచైజ్ మరియు RRR తో రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ ని ఎలా మార్చారు అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రతి స్టార్ హీరో రాజమౌళితో కలిసి పనిచేయాలని కోరుకుంటారు మరియు వారు స్క్రిప్ట్ గురించి అడగకుండా గుడ్డిగా ఆయన దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు.
భారతీయ బాక్సాఫీస్ వద్ద తమ ప్రతి చిత్రాన్ని భారీ రేంజ్‌లో అందించాలని కోరుకునే స్టార్ హీరోల ఆలోచనలో పాన్-ఇండియా సినిమా అనే అంశం అత్యంత ముఖ్యమైన ప్రభావాన్ని కలిగిస్తుంది.
స్టార్ హీరోలు ఇప్పుడు ఒక చిత్రం కోసం 2 సంవత్సరాలైనా వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్లే వారు దర్శకులకు చాలా పటిష్టంగా ఉండేలా ఉత్తమమైన కంటెంట్ ను అందించాలని కోరుకుంటున్నారు. మరి దర్శక నిర్మాతలతో మన స్టార్ హీరోలు చూరగొన్న ఈ వైఖరిలో వారు ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.