తెలుగు సినిమా పరిశ్రమకు మళ్ళీ మంచి రోజులు రానున్నాయి. అన్ని సమస్యలు తీరిపోయి మళ్ళీ త్వరితగతిన గాడిన పడటానికి సిద్ధం అవుతుంది. గత మూడు వారాలుగా సినిమా షూటింగ్‌లు లేక వెలవెలబోయిన ఇండస్ట్రీ, తొందరలోనే తిరిగి రంగంలోకి దూకనుంది.
గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమ రకరకాల సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్మాతల గిల్డ్ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, పలు మార్గదర్శకాలను కూడా సూచించారు. అలాగే సమస్యలను కూలంకషంగా చర్చించుకుని అందరూ ఒక మాట మీదకు వచ్చిన తరువాతే సినిమాల మీద దృష్టి పెట్టాలి అనే ఉద్దేశంతో ఆగస్టు నెల ప్రారంభం నుంచి సినిమా షూటింగ్‌లను ఆపేసిన విషయమూ విదితమే.. ఇక అనుకున్నట్లుగానే గిల్డ్ సభ్యులు కొన్ని నిర్ణయాలను అమలు చేయబోతున్నారు. టికెట్ రేట్లు.. థియేటర్లలో లభించే తినుభండారాల రేట్ల దగ్గరి నుంచి .. నిర్మాణ వ్యయం, అలాగే హీరోలు మరియు నటీనటుల రెమ్యూనరేషన్లో కోత ఇలా అన్ని అంశాల మీద చర్చలు జరిపిన నిర్మాతలు చినరికి ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే షూటింగ్‌లపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేశారు. ఇక పై ఏ అడ్డంకులు లేకుండా అందరూ షూటింగ్‌లు జరుపుకోవచ్చంటూ ప్రకటన చేశారు.
సెప్టెంబర్ 1 నుంచి అన్ని సినిమాల షూటింగులు తిరిగి ప్రారంభించబడతాయని నిర్మాత దిల్ రాజు చెప్పారు. అలాగే ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ జరుపుకున్న సినిమాలు, విదేశాలలో షెడ్యూల్ లు ఖరారైన చిత్రాలకు ముందుగా ప్రాధాన్యతను ఇస్తూ.. ఆ సినిమాలు మాత్రం ఆగస్టు 25 నుంచి షూటింగ్‌లను మొదలు పెట్టవచ్చని చెప్పారు గిల్డ్ సభ్యులు దిల్ రాజు.
నిర్మాతల గిల్డ్ చర్చలలో ఉన్న మరో అంశం వీపీఎఫ్ ఛార్జీలు. ఆ విషయం పైనా ఒక నిర్ణయానికి వచ్చారు నిర్మాతలు. అదేంటంటే దిల్ రాజు, అల్లు అరవింద్, యూవీ క్రియేషన్స్ మరియు ఎన్ వీ ప్రసాద్ లకు చెందిన ధియేటర్లలో నిర్మాత/ పంపిణీదారుల పై వీపీఎఫ్ చార్జీల ధరల భారం మోపబోమని ఈ మేరకు దిల్ రాజు స్పష్టంగా చేశారు.
అంతే కాదు ఇన్ని రోజుల పాటుగా నిర్మాతలందరూ చర్చించి తీసుకున్న నిర్ణయాలను ఆగస్టు 30న మరోసారి మొత్తం వ్యవహారం అంతటికీ తుది ప్రెస్ మీట్ గా నిర్వచించి వెల్లడిస్తామని దిల్ రాజు పేర్కొన్నారు. మొత్తానికి అన్ని సమస్యలు తీరిపోయి పరిశ్రమ మళ్ళీ క్రమ పద్ధతిలో అన్ని పనులు నడిచే దిశగా అడుగులు వేయడం ఎంతో అనందకరం.