వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చిత్రాలు విడుదలకు ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి మరియు ఈ రెండు యాక్షన్ ఎంటర్ టైనర్ లను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కు తాజాగా ఒక శుభవార్త లభించింది.
ఈ రెండు సినిమాలకు ఆంధ్రప్రదేశ్ లో 45 రూపాయల టికెట్ పెంపు మంజూరు చేయబడింది. మైత్రి మూవీ మేకర్స్ మొదట ఏపీలో రూ.70 పెంచాలని దరఖాస్తు చేసుకోగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను 45 రూపాయల వరకు పెంచేందుకు గానూ అనుమతి ఇచ్చింది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
జనవరి 12న వీరసింహారెడ్డి, జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదల కానున్నాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి ట్రైలర్స్ రెండు సినిమాల పై అంచనాలను పెంచాయి మరియు సంక్రాంతికి చిరంజీవి మరియు బాలకృష్ణల ఈ ఆసక్తికరమైన క్లాష్ ను చూడటానికి ఇరు వర్గాల అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
2017 సంక్రాంతి సందర్భంగా చిరంజీవి ఖైదీ నెం.150, బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు పోటీగా విడుదల అయిన తర్వాత ఈ ఇద్దరు సీనియర్ హీరోలు మరోసారి పోటీ పడుతున్నారు.
రవితేజ, శృతి హాసన్, ప్రకాష్ రాజ్, కేథరిన్ థ్రెసా కీలక పాత్రల్లో నటించిన వాల్తేరు వీరయ్య ఒక యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి మెగా వీరాభిమాని బాబీ దర్శకత్వం వహించారు. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్, హానీ రోజ్ హీరోయిన్లుగా నటించగా.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయక పాత్రలు పోషించారు.
వాల్తేరు వీరయ్య సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బాస్ పార్టీ, పూనకాలు లోడింగ్ పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరసింహారెడ్డి సినిమాకి థమన్ సంగీతం అందించిన జై బాలయ్య, సుగుణ సుందరి పాటలు ప్రాచుర్యం పొందాయి.