గత కొన్ని నెలలుగా గడ్డు కాలాన్ని ఎదురుకున్న తెలుగు సినిమా పరిశ్రమకు ఆగస్ట్ నెల మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చింది. ఆగస్ట్‌లో టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు అద్భుతమైన కలెక్షన్లు సాధించిన తర్వాత, సెప్టెంబర్ నెల కూడా అదే విధంగా మంచి రోజులు కొనసాగిస్తుందని ట్రేడ్ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నారు. లైగర్ మినహా, ఆగస్ట్‌లో విడుదలైన తెలుగు చిత్రాలు దాదాపు అన్ని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి, పంపిణీదారులు మరియు ఎగ్జిబిటర్‌లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి.
కాగా ఈ వారం మూడు కొత్త సినిమాలు విడుదలయ్యాయి. తమిళ హీరో చియాన్ విక్రమ్ నటించిన కోబ్రా చిత్రం గణేశుని పండుగ సందర్భంగా విడుదలైంది. సెలవు రోజున విడుదల అవడం వల్ల బాక్సాఫీస్ వద్ద తొలి రోజు అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. కానీ సినిమాకి టాక్ నెగటివ్ గా రావడంతో తరువాతి రోజుల్లో అదే ఊపును కొనసాగించలేకపోయింది. అయినప్పటికీ, తక్కువ బిజినెస్ జరిగిన కారణంగా బయ్యర్స్ పెద్దగా నష్టపోలేదు.
ఇక శుక్రవారం తక్కువ హైప్‌తో విడుదలైన రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా, మరియు అనుదీప్ కెవి రచించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సెప్టెంబర్ 2న విడుదలయ్యాయి.
రంగ రంగ వైభవంగా చాలా సాధారణ స్థాయిలో తొలి రోజు ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. సినిమాకు బ్యాడ్ టాక్ త్వరగా వ్యాపించడంతో..ఈ చిత్రం రెండవ రోజునే బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా కుప్పకూలింది. డబ్బింగ్ సినిమా అయిన కోబ్రా చిత్రం రంగ రంగ వైభవంగా కంటే ఎక్కువ వసూలు చేయడం గమనార్హం. మొత్తంగా రంగ రంగ వైభవంగా చిత్రం కొనుగోలుదారులకు భారీ నష్టం తెచ్చే వైపు పరుగులు తీస్తుంది. వారు పెట్టిన ఖర్చులో దాదాపు 70 శాతం కంటే ఎక్కువ నష్టపోతారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కథ అందించి మెంటర్ గా వ్యవహరించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా తొలిరోజునే అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అసలు తొలిరోజే జీరో షేర్ సాధించి బాక్స్ ఆఫీసు వద్ద వాషౌట్ అయింది.