తన మీద వస్తున్న ట్రోల్స్ ఇక పై భరించలేనని, అవి తన కుటుంబం పై కూడా ప్రభావం చూపుతున్నాయని రష్మిక మందన్న అన్నారు. రష్మిక మందన్న తన పై ఉన్న అసమంజసమైన ద్వేషం నుంచి ఇంకా కోలుకుంటున్నారు.
ఇటీవల కాలంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సౌత్ ఇండియాలో మాస్ మసాలా, ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. కానీ రొమాంటిక్ సాంగ్స్ కు మాత్రం బాలీవుడ్ ది బెస్ట్. బాలీవుడ్ లో నా మొదటి రొమాంటిక్ సాంగ్ రాబోతోంది, నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను అని లోగడ ఒక ఈవెంట్ లో రష్మిక వ్యాఖ్యానించారు. అయితే ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు, తీవ్ర ట్రోల్స్ చేశారు.
తాజాగా రష్మిక మందన్న మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆమె వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా.. దీనిపై రష్మిక స్పందిస్తూ.. ‘ఆ రోజు నా ప్రసంగాన్ని సగానికి ఆపేశారు. నేను ఇంకా మాట్లాడాల్సి ఉండింది. దక్షిణాదిలో నా రొమాంటిక్ సాంగ్స్ చాలా వరకు హిట్ అయ్యాయి. వాళ్లకు ఎలాగూ అర్థమవుతుందని నేను చెప్పలేదు” అని ఆమె అన్నారు.
ఎప్పుడైనా సినీ పరిశ్రమను వదిలి వెళ్లాలని అనిపించిందా అని అడిగిన ప్రశ్నకు రష్మిక సమాధానమిస్తూ.. కొన్నిసార్లు మాత్రం దాని గురించు ఆలోచిస్తానని ఆమె చెప్పారు. తను శ్వాస తీసుకోవడంలో కూడా ప్రజలకు సమస్య వచ్చినట్లుగా మారిందని ఆమె అన్నారు. ఏదో ఒక బలమైన కారణంతో వారు తనను ద్వేషిస్తే పర్వాలేదని ఆమె పేర్కొంది.
కానీ తనని ద్వేషించే వారు తనను ఎందుకు ట్రోల్ చేస్తున్నారో క్లారిటీ ఇస్తే బాగుంటుందని కూడా అన్నారు. చివరిగా ఈ ట్రోల్స్, దూషణలు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని రష్మిక పేర్కొన్నారు. రష్మిక మందన్న నటించిన ‘మిషన్ మజ్ను’ జనవరి 20న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమాలో రష్మిక మందన్న నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కాగా ఈ సినిమాలో రష్మిక ఒక అంధురాలైన పాకిస్తానీ అమ్మాయి పాత్రలో నటించారు.