బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచిన కన్నడ చిత్రం కాంతార కు వెండితెర పైనే కాకుండా బుల్లితెర పై కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం భారీ టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసింది.
థియేటర్స్ లో భారీ విజయాన్ని నమోదు చేసిన కాంతార స్మాల్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటింది. ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ఈ సినిమాకు 12.35 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇక తన సొంత గడ్డ అయిన శాండల్ వుడ్ లో కూడా అత్యధిక టీఆర్పీ రేటింగ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా కాంతార రికార్డు సృష్టించడం విశేషం.
దాదాపు 16 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. రిషభ్ శెట్టి కాంతార సినిమాలో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. భూతకోల అనే కళ నేపథ్యంలో కాంతార సినిమాను తీశారు.
తమకు ఇచ్చిన భూములను ఆక్రమించుకోవాలనుకున్న రాజకుటుంబానికి వ్యతిరేకంగా శివ అనే యువకుడు దేవుడి సహాయంతో ఎలా పోరాడాడన్నదే ఈ చిత్ర కథ. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మిస్టరీ ఎలిమెంట్స్ కూడా ఉండి ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి.
చాలా తక్కువ ధియేటర్లలో కన్నడలో చిన్న సినిమాలా విడుదలైన ఈ చిత్రం ఎక్స్ ట్రార్డినరీ కంటెంట్, టాక్ తో కర్ణాటక బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాకుండా కేజీఎఫ్ 2 రికార్డులను బద్దలు కొట్టి హిందీ, తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో డబ్ అయి అన్ని భాషల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా తెలుగు, హిందీలో ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ సాధించింది.
రిషబ్ శెట్టి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకం పై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్ కుమార్ జి కీలక పాత్రలు పోషించారు.