దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఒక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ వారాంతంలో USA లో రీ రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మంచి వసూళ్లు రాబడుతోంది. అందుకే ఆస్కార్ ప్రమోషన్స్ ను దృష్టిలో పెట్టుకుని మార్చి 10న తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎలా ప్రదర్శితం అవుతుందో చూడాలి. ఆ రోజు కొత్త సినిమాలేవీ విడుదల లేకపోవడంతో ఆర్ ఆర్ ఆర్ కు మంచి కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ 2022 మార్చిలో విడుదలై ఏడాది దాటినా ఆ సినిమా యొక్క మ్యాజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం 2023 ఆస్కార్ ప్రమోషన్లో భాగంగా మార్చి 1న అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శనలో విడుదలైంది. కాగా ఆ స్క్రీనింగ్ హౌస్ ఫుల్ గా నమోదైంది. ఆ షోకు 1,600 టికెట్లు అమ్ముడుపోగా, పెద్ద తెర పై ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది క్యూ కట్టారు.
మార్చి 12న జరగనున్న 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందు నిర్మాతలు ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. స్పెషల్ స్క్రీనింగ్ కు ముందు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఏస్ హోటల్ లో అక్కడి ప్రేక్షకులతో మాట్లాడారు.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 2023 ఆస్కార్ అవార్డుకు ‘ఆర్ఆర్ఆర్’ నాటు నాటు పాట నామినేట్ అయింది. అంతే కాకుండా ఈ పాటను గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ వేదిక పై లైవ్ లో ప్రదర్శించనున్నారు. ఆర్ఆర్ఆర్ ఇలా ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవడం చూసి తెలుగు సినీ ప్రేమికులు గర్వంగా ఫీలవుతున్నారు. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లతో పాటు ఆర్ఆర్ఆర్ టీం మొత్తం ఈ గ్రాండ్ నైట్ కు హాజరు కానున్నారు.