ఓటీటీ విడుదలల పై గతంలో తెలుగు సినీ నిర్మాతలు చాలా సమావేశాలు నిర్వహించారు. థియేట్రికల్ రిలీజ్ డేట్ నుంచి 6 వారాలు లేదా 7 వారాల లోపు ఏ సినిమా విడుదల కాదని చెప్పారు. ఐతే వాళ్ళు చెప్పిన విధంగా ఇండస్ట్రీలో ఎవరూ ఈ నియమాన్ని పాటించడం లేదన్నట్లుగా కనిపిస్తుంది.
ఇటీవలే సుధీర్ బాబు నటించిన హంట్ సినిమా జనవరి 26న రిలీజ్ కాగా ఆ సినిమాని కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక సూర్యదేవర నాగవంశీ తెరకెక్కించిన బుట్టబొమ్మ గత వారమే విడుదల కాగా, ఇప్పుడు ఆ సినిమాని కూడా ముందస్తు ఓటీటీ స్ట్రీమింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. బహుశా వచ్చే వారాంతంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న సినిమా టికెట్ ధరలు, ఓటీటీ విడుదలలు, ఇతర సమస్యలు, టాలీవుడ్ లో అడ్డంకులు తదితర అంశాల పై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల సమావేశమైంది.
పెరిగిన టికెట్ ధరలు, ఓటీటీ విండో వంటి కొన్ని సమస్యలతో పాటు మరి కొన్ని అంశాలను ఎదుర్కునేందుకు కఠిన నిబంధనలు అమలు జరిగేలా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఆ సమావేశంలో చిన్న బడ్జెట్ సినిమాలన్నీ ధియేట్రికల్ రిలీజ్ నుంచి నాలుగు వారాల గ్యాప్ తో ఓటీటీలో విడుదల అవుతాయని వారు తెలియజేశారు. ఇక మీడియం, భారీ బడ్జెట్ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన 10 వారాల తర్వాతే డిజిటల్ రిలీజ్ చేయాలనీ తీర్మానించారు.
అయితే తెలుగు సినీ పరిశ్రమలో నిభందనలు కేవలం నామమాత్రానికే ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగానే నడుచుకుంటారు. ఈ విషయం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులకు కూడా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ నిర్మాతలు, దర్శకులు పరిస్థితులకు అనుగుణంగా ప్రకటనలు చేస్తూ తప్పుడు హామీలు ఇస్తూనే ఉంటారు.