మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ సంస్థగా చెప్పుకోవచ్చు. నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్‌ల నేతృత్వంలోని ఈ ప్రొడక్షన్ హౌస్ చాలా తక్కువ సమయంలో అనేక భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించింది. దాదాపు అందరు స్టార్ హీరోలు కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రయాణంలో భాగం కావడం విశేషం.
ఇక తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ నైజాం ప్రాంతంలో తమ సినిమాలను సొంతంగా విడుదల చేయడం ప్రారంభించింది. నైజాంలో ముగ్గురు నలుగురు తప్ప మెయిన్ డిస్ట్రిబ్యూటర్లు లేరు. దిల్ రాజు.. మరియు సునీల్ నారంగ్ నేతృత్వంలోని ఏషియన్ ఫిల్మ్స్ మాత్రమే అధిక లాభదాయక ప్రాంతం అయిన నైజాం ప్రాంతంలో ప్రధాన పంపిణీదారులుగా చలామణి అవుతున్నాయి.
క్రాక్ సినిమా భారీ సక్సెస్ తర్వాత వరంగల్ శ్రీను అనే కొత్త పంపిణీదారుడు నైజాంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆచార్య, లైగర్ వంటి భారీ డిజాస్టర్లతో పాటు ఇతర చిత్రాల భారీ పరాజయం ఆయన్ని రేసులో వెనక్కి నెట్టినట్టు అయింది.
దీంతో నిర్మాతలకు నైజాం ఏరియాలో సినిమాలు విడుదల చేయాలంటే దిల్ రాజు మరియు ఏషియన్ గ్రూప్ అనే రెండు ఆప్షన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలా మంది నిర్మాతలు ఈ ఇద్దరికే సినిమాను అమ్మాలనే ఒత్తిడి కూడా చేయటం జరగుతుంది. అయితే ముందుగానే చెప్పుకున్నట్టు ప్రస్తుతం టాలీవుడ్‌లోని ప్రముఖ తారలందరితో భారీ స్థాయిలో సినిమాలు చేస్తున్నారనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే మైత్రీ సంస్థ వారికి ఇది నచ్చలేదు.
తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తెరిచి, ఇక నుంచి తమ సినిమాలన్నీ తామే విడుదల చేసుకుందాం అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అయితే ఇప్పుడు మైత్రీ వారు కేవలం తమ సినిమాలను మాత్రమే పంపిణీ చేస్తారా లేక ఇతర నిర్మాణ సంస్థల నుంచి వచ్చే సినిమాల తాలూకు హక్కులను కూడా కొంటారా అనే ప్రశ్న తలెత్తింది. ఒకవేళ ఇదే గనక జరిగితే, నిర్మాతలకు దిల్ రాజు కాకుండా సినిమాను విక్రయించడానికి మరిన్ని ఎంపికలు ఉండే అవకాశం ఉన్నందున తెలుగు సినీ పరిశ్రమ కూడా సంతోషంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.