తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘సూర్య 42’. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్, బిజినెస్ తాలూకు వివరాలతో వార్తల్లో నిలిచింది. ఇక తాజాగా నిర్మాత జ్ఞానవేల్ రాజా మీడియాకు ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోందని, సూర్య గత చిత్రాల కంటే దీని బడ్జెట్ 3 రెట్లు ఎక్కువని ఆయన అన్నారు. బాహుబలి, కేజీఎఫ్ సిరీస్ లకు తమిళ పరిశ్రమ నుంచి వచ్చే సమాధానంగా ఈ సినిమా ఉంటుందని కూడా ఆయన అన్నారు.
సూర్య 42 సినిమా యొక్క షూటింగ్ 50 శాతం వరకు పూర్తయిందని, ఏప్రిల్ లో విడుదల తేదీని ప్రకటించి, మేలో టీజర్ ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. జ్ఞానవేల్ రాజా పంచుకున్న మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ప్రచారానికి ఖర్చు అయ్యే బడ్జెట్ మొత్తం సినిమా కంటే ఎక్కువగా.. అలాగే ఇతర నటీనటుల సినిమా బడ్జెట్ తో సమానంగా ఉంటుందట.
విక్రమ్, లియో సినిమాల తరహాలో ‘సూర్య 42’ టైటిల్ అనౌన్స్మెంట్ ప్రోమో కూడా విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ విషయం విన్న సూర్య అభిమానులు ఈ సినిమా పై విపరీతమైన అంచనాలు పెంచేసుకున్నారు.
‘సూర్య 42’ షూటింగ్ భారీ స్థాయిలో ప్రారంభమైంది. స్టూడియో గ్రీన్ పతాకం పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ సూర్య సరసన నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
దాదాపు పది భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా సూర్య 42 రూపొందుతోంది. షూటింగ్ సమయంలోనే ఈ సినిమా భారీ బిజినెస్ చేసిందని పలు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా యొక్క హిందీ రైట్స్, శాటిలైట్, డిజిటల్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు కూడా సమాచారం అందింది.