మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మగధీరను రీ రిలీజ్ చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఈ వార్త అభిమానులను ఒక్కసారిగా ఎనలేని ఆనందానికి గురి చేసింది. అయితే ఇప్పుడు ఇదే విషయంలో చరణ్ అభిమానులకు నిరాశ కలిగించే వార్త బయటకు వచ్చింది.
సాంకేతిక కారణాల వల్ల సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ మగధీర రీ రిలీజ్ క్యాన్సిల్ అయిందని గీతా ఆర్ట్స్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ విజువల్ ఎంటర్ టైనర్ ను మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాం. త్వరలోనే సరైన సమయంలో తీసుకొస్తామని ఆశిస్తున్నాం అని తమ ట్వీట్ లో అన్నారు.
రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర అప్పట్లో అత్యంత ఖరీదైన తెలుగు చిత్రంగా నిలవడమే కాకుండా, విడుదల సమయంలో తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది.
అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో శ్రీహరి, కాజల్ అగర్వాల్, దేవ్ గిల్ కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. మగధీర 57వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పలు అవార్డులను గెలుచుకోవడంతో పాటు ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను, తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకుంది.