నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమాల్లో ఒకటైన NBK 108 లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. బాలయ్యను కొత్త అవతారంలో ప్రెజెంట్ చేయనుండటం.. పైగా ఆయన దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడం ఇదే తొలిసారి కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
హీరో బాలకృష్ణ నటించిన అత్యధిక హిట్ సినిమాలు గమనిస్తే ఆయనకు ఒక పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ సెంటిమెంట్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లు ఆయన సినిమాల విజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు సింహా, లెజెండ్, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి ఇలా మరెన్నో సినిమాలను తీసుకోవచ్చు.
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా విషయంలోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సెంటిమెంట్ ను ఫాలో అవడం ద్వారా సక్సెస్ అవ్వొచ్చని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర రెండు షేడ్స్ ను చూపిస్తుందని, ఒకటి మామూలు మనిషిలా, మరొకటి ఫ్లాష్ బ్యాక్ లో ప్రత్యర్థుల పై మృగంలా విరుచుకు పడే విధంగా ఉంటుందని అంటున్నారు.
NBK 108 ఈ ఏడాది దసరా సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఏడాది వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. మార్చి 31, శుక్రవారం నాడు ఈ దసరాకు థియేటర్లలో సినిమా విడుదలవుతుందని నిర్మాతలు వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సినిమాకు ట్రేడ్ మార్క్ అయిన మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. బాలయ్య లాంటి హీరోను డైరెక్ట్ చేసే అవకాశం రావడం పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని అనిల్ రావిపూడి అన్నారు. NBK 108లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, ఆయన కూతురిగా శ్రీలీల కనిపించనున్నారు.