సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రారంభం కానప్పటికీ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు అంతర్గత వర్గాల ద్వారా చక్కర్లు కొడుతోంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి స్థాయి ఇప్పుడు మరో స్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక తదుపరి సినిమాతో ఇంటర్నేషనల్ మార్కెట్ ను చేజిక్కించుకోవడంపై దృష్టి పెట్టారు. తన గత చిత్రంతోనే భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రపంచ వేదిక పై మరింత పేరు తెచ్చే స్థాయిలో మహేష్ సినిమాను అందించాలనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్న చిత్రబృందం రెండు భాగాలుగా కథని రూపొందిస్తుందని సమాచారం.
మహేష్ బాబుకు కూడా రాజమౌళితో కలిసి పని చేయాలనేది చాలా రోజుల కోరికగా ఉంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ తన నాలుగేళ్ల సమయాన్ని రాజమౌళి సినిమా కోసం కేటాయించనున్నారు. ఇక రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత కె.వి.విజయేంద్రప్రసాద్ గతంలో ఓ నిజజీవిత సంఘటనే ఈ చిత్రానికి ప్రేరణగా నిలిచిందని ధృవీకరించారు. ఇదొక అడ్వెంచర్ స్టోరీ అని తెలిపారు.
తొలి భాగానికి సంబంధించిన స్క్రిప్టును సిద్ధం చేస్తున్నామని విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి సీక్వెల్స్ ఉంటాయా అని కె.వి.విజయేంద్రప్రసాద్ ను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా సీక్వెల్స్ ఉంటాయని అన్నారు. ఈ సీక్వెల్స్ లో కథ మారుతుందని, అయితే ప్రధాన పాత్రలు అలాగే ఉంటాయని ఆయన అన్నారు. ఇక ఈ సినిమాలో హార్డ్ కోర్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని, ఇవి గత ఎస్ ఎస్ రాజమౌళి సినిమాల కంటే మరింత అద్భుతంగా ఉంటాయని అంతర్గత వర్గాలు వెల్లడించాయి.
ఆ రకంగా ఈ SSMB29 తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అతిపెద్ద చిత్రాల్లో ఒకటి మాత్రమే కాదు, ఇతర పరిశ్రమలు మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించే సినిమాగా నిలుస్తుంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ వల్ల ఇప్పటికే హైప్ రాగా, ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన అంతర్జాతీయ గుర్తింపుతో ఈ సినిమా స్థాయి మరింత పెద్దదైంది.