పైరసీని నేరుగా ఎదుర్కోవడంతో పాటు సెన్సార్ సర్టిఫికేషన్ లో కొన్ని ఆసక్తికరమైన మార్పులతో కూడిన కొత్త సినిమాటోగ్రఫీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో సినిమా సర్టిఫికేషన్ విషయంలో కేవలం మూడు కేటగిరీలు మాత్రమే ఉండేవి. అంటే 12 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల సహకారంతో కూడిన ‘యు/ఎ’ అని ఒకటి. మరొకటి పెద్దలకు మాత్రమే అనబడే ‘ఎ’ కేటగిరీ.
కేంద్ర కేబినెట్ నిర్ణయాల పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు వివరిస్తూ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. పైరసీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, వయసు ఆధారిత సినిమా వర్గీకరణ, ప్రస్తుత చట్టంలోని కొన్ని అనవసర నిబంధనల పై చర్యలు తీసుకోవాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని ఆయన చెప్పారు.
అనురాగ్ ఠాకూర్ చెప్పిన విధంగా సెన్సార్ షిప్ లోమరిన్ని కేటగిరీలను చేర్చేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అవి ‘యు’ అంటే సార్వత్రికం, ‘యు/ఎ’ 7+, ‘యు/ఎ’ 13+, ‘యు/ఎ’ 16+ మరియు ‘ఎ’ అంటే 18 ఏళ్లు పైబడిన పెద్దలకు మాత్రమే. సర్టిఫికేషన్ లోని ప్రయోజనాల కోసం ఈ ఉప వర్గీకరణను కొత్త బిల్లులో ప్రవేశపెట్టారు మరియు ఓటీటీ కంటెంట్ ను హద్దుల్లో ఉంచడానికి కూడా దీనిని ప్రధానంగా ఉపయోగిస్తారట.
సినిమా ఆడిటెడ్ స్థూల నిర్మాణ వ్యయంలో 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నందున కొత్త బిల్లుతో పైరసీని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోంది. అంతే కాకుండా పైరసీ వంటి నేరానికి పాల్పడితే రూ.3 లక్షల జరిమానాతో పాటు ఆ నేరం చేసిన వ్యక్తికి మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పైరసీని చాలావరకు నియంత్రిస్తుందని, ప్రతి సినిమాకు కోట్ల బడ్జెట్ ఖర్చు చేసే నిర్మాతలు కొంతయినా ఉపశమనం కలిగిస్తుందని ఆశిద్దాం.