ఈ రిపబ్లిక్ డే కోలీవుడ్ ప్రేక్షకులు, దళపతి విజయ్ అభిమానులకు ప్రత్యేకమైన రోజుగా ఉండబోతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ భారీ సినిమాను (Thalapathy67) ఆ రోజు ఓ వీడియోతో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఈ ప్రకటనతో ఖైదీ, విక్రమ్ సినిమాలతో లింక్ అయి ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా ఉంటుందా లేదా అనేది తేలిపోతుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను విజయ్ ప్రారంభించారు. కాగా ఇందులో అయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో 40 ఏళ్ల వయసున్న గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్లు సమాచారం. విలన్ పాత్ర కోసం సంజయ్ దత్ ను తీసుకున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత దక్షిణాదిలో విలన్ గా బాలీవుడ్ నటుడు చేస్తున్న రెండో భారీ ప్రాజెక్ట్ ఇది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఇప్పుడు కాశ్మీర్ కు వెళుతుంది, అక్కడ వారు సంజయ్ దత్ తో కలిసి సన్నివేశాలను చిత్రీకరిస్తారు.
ఇటీవల వచ్చిన ఫ్యామిలీ డ్రామా ‘ వారిసు’ తర్వాత విజయ్ ని యాక్షన్ రోల్ లో చూడాలని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అంటే ఎలివేషన్ మరియు యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు కాబట్టి అంచనాలు తారాస్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు.
కాగా తమిళనాట వారిసు ఘనవిజయం సాధించినా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇక ‘దళపతి 67’ సినిమాతో లోకేష్ కనగరాజ్, విజయ్ లు కేవలం కోలీవుడ్ ప్రేక్షకుల లోనే కాకుండా ఇతర దక్షిణాది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించనున్నారు.