తమిళ సినిమా పరిశ్రమలో ప్రతి తరంలోనూ, ఇద్దరు లేదా ముగ్గురు అగ్ర హీరోలు, నటులు ఎల్లప్పుడూ భారీ సంఖ్యలో అభిమాన గణాన్ని ఆస్వాదిస్తూ వచ్చారు. తమిళ చలనచిత్ర పరిశ్రమ ఎదుగుతున్న సంవత్సరాల్లో, ఎంజీఆర్, జెమినీ గణేశన్ లతో పాటు శివాజీ గణేశన్ వంటి నటులు తమిళ సినిమాను శాసించారు. కాగా వారు నిరంతరం బలమైన అభిమానుల ఆదరణ మరియు ప్రేమను ఆస్వాదించేవారు. అంతే కాకుండా అన్ని వేళలా ఆయా హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీని కొనసాగిస్తూ వచ్చారు.
పైన పేర్కొన్న మహానటుల తర్వాత. ఎనభైల కాలం నుండి తమిళ సినిమా ముఖచిత్రాల తరహాలో కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వారు ఆ పద్ధతిని క్రమం తప్పకుండా అనుసరించారు. అయితే వీరిద్దరి మధ్య ఎవరు పెద్ద స్టార్ లేదా ఎవరికి ఎక్కువ అభిమానుల సంఖ్య ఉంది అనే విషయాల పై చర్చలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కమల్ హాసన్ తనదైన శైలిలో విలక్షణ పాత్రలు, సినిమాలతో క్లాస్ ప్రేక్షకులలో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు, ఇక రజనీకాంత్ మాస్, కమర్షియల్ సినిమాలను ఎక్కువకాలం అందిస్తూ మాస్ ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా నిలిచారు.
వారి తరం తరువాత.. ప్రస్తుత తమిళ సినిమా రంగంలో విజయ్ మరియు అజిత్ లు అగ్ర తారలుగా రాజ్యం ఎలుతున్నారు. వీరిద్దరి సినిమాలు విడుదలైనప్పుడల్లా వారి అభిమానులు ఒక పండగ వాతావరణం సృష్టించి ఆయా సినిమాల వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఇద్దరికీ ఎనలేని, అమితమైన స్థాయిలో అభిమానుల మద్దతు ఉంటూ వచ్చింది. పైగా హిట్, ఫ్లాపులు ఎన్ని ఎదురయినా అభిమానులు వాళ్ళ హీరోను నిరాశపరచకుండా వెన్నంటే ఉంటారు.
ఇక రాబోయే పండగ సీజన్, అంటే పొంగల్ 2023 బరిలో విజయ్ మరియు అజిత్ ఒకరి సినిమాతో ఒకరు థియేటర్ల వద్ద పోరాడుతారని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ నటించిన వరిసు, హెచ్.వినోద్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న తునివు.. ఈ రెండు చిత్రాలు పొంగల్ సందర్భంగా విడుదల కాబోతున్నాయి. ఈ సందర్బంగా ఇరువురి హీరోల అభిమానుల మధ్య పూర్తి ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని, అలాగే ఎవరి చిత్రం హిట్ అయినా అంతిమంగా సినిమా అనేది విజయం సాధిస్తుందని ఆశిద్దాం.