ఇటీవల కొన్నేళ్లుగా సినిమా పరిశ్రమకు పైరసీ ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి వేలాది మంది పనిచేసే ఒక సినిమా యొక్క పైరసీని రిలీజ్ రోజునే కొన్ని గంటల్లో ఆన్లైన్లో విడుదల చేస్తుండటం విచారకరం. తాజగా నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ మూవీ కూడా పైరసీ బారిన పడింది.
కొద్దిరోజుల క్రితం ఒక ఆర్టీసీ బస్సులో ఈ సినిమా యొక్క పైరసీ బయటికి రావడంతో అధికారులు ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ ని అరెస్ట్ చేశారు. ఇక ఈ విషయమై తాజాగా తండేల్ నిర్మాతలు మాట్లాడుతూ జీ తెలుగు వంటి కొన్ని ప్రముఖ మాధ్యమాలు కూడా పలానా సినిమా పైరసీలో కూడా వచ్చేసింది అంటూ అనౌన్స్ చేస్తూ ఆర్టికల్స్ రాయటం సరికాదని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
దయచేసి మన సినిమాలను మనమే ఈ విధంగా చంపే సంస్కృతికి చరమగీతం పాడదాం అన్నారు. ఇకపై ఇటువంటి చర్యలు చేయవద్దని కోరారు. నిజానికి తమ సినిమాని కొంతవరకు పైరసీ భూతం దెబ్బేసిందని, రాబోయే రోజుల్లో పైరసీపై చిత్రపరిశ్రమ మరింత గట్టిగా చర్యలు తీసుకోవాలని తండాల్ నిర్మాతలు కోరారు.