దక్షిణ భారతీయ దిగ్గజ దర్శకులలో మురుగదాస్ ఒకరు.2001లో దర్శకుడుగా పరిచయం అయిన మురుగదాస్ అనతికాలంలోనే తన స్థాయిని పెంచుకుంటూ వెళ్ళారు. కేవలం తమిళ ఇండస్ట్రీ ఏ కాకుండా తెలుగు,హిందీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. బాలీవుడ్ ఇండస్ట్రీ కి మొట్టమొదటి 100 కోట్ల చిత్రాన్ని (గజిని) ఇచ్చిన ఘనత కూడా ఆయనకే చెందుతుంది.
22 ఏళ్ళ క్రితం తను తొలిసారి మెగాఫోన్ పట్టిన “దీనా” సినిమాకి హీరో మరెవరో కాదు తమిళ అగ్ర హీరో అజిత్. ఆ సినిమా తరువాత మూడేళ్లకి అంటే 2004 లోనే మళ్ళీ వీరిద్దరి కలయికలో సినిమా రావాల్సి ఉన్నా అనుకొని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే దాదాపు రెండు దశాబ్దాల తరువాత మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని సమాచారం.
ప్రస్తుతం అజిత్ H వినోద్ తో సినిమా చేస్తున్నాడు.ఆ తరువాత విఘ్నేష్ శివన్ తో సినిమా కూడా ఇదివరకే అనౌన్స్ చేశారు.ఈ రెండు సినిమాల తరువాత మురుగదాస్ తో అజిత్ పని చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనక నిజం అయితే ఖచ్చితంగా అజిత్ అభిమానులకు మరియు తమిళ సినిమా ప్రేక్షకులకు ఇది ఆనందించే విషయమే.
మురుగదాస్ ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ తో తీసిన “దర్బార్” పరాజయం పాలయింది. దాంతో ఇప్పుడు అజిత్ తో చేస్తున్న సినిమాతో సరైన విజయం సాధించి తన సత్తా ఏంటో రుజువు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.అజిత్ కి పోటీదారుడు అయిన మరో అగ్ర హీరో విజయ్ తో మురుగదాస్ కు హ్యాట్రిక్ విజయాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అజిత్ తో తీసే సినిమాకు భారీ అంచనాలు ఉంటాయి అనడంలో సందేహం లేదు.