జేమ్స్ కామెరూన్ యొక్క అవతార్ 2 ఈ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణను పొందుతోంది అదే విధంగా బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది.
ముఖ్యంగా భారతదేశంలో, అవతార్: ది వే ఆఫ్ వాటర్ అద్భుతమైన స్పందనని పొందుతోంది మరియు తెలుగు రాష్ట్రాలలో ప్రేకకులు ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లకు విపరీతంగా సహకరిస్తున్నారు. దర్శకుడు జేమ్స్ కామెరాన్ యొక్క దృష్టికి, కల్పనకి మరియు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్‌లను వెలికితీసినందుకు ప్రేక్షకులు విస్తృతంగా ప్రశంసిస్తున్నారు.
అయితే అంత భారీ స్థాయిలో తెరకెక్కించిన సినిమా యొక్క కథ మాత్రం చాలా సరళంగా ఉందని, ఆ రకంగా అవతార్ 2 కథాంశం గురించి ఫిర్యాదు చేసిన కొన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఉన్నారు.
సోషల్ మీడియాలో, కొందరు ప్రేక్షకులు అవతార్ 2 యొక్క కథాంశం వెంకటేష్ నటించిన నారప్ప సినిమాతో చాలా పోలి ఉందని అంటున్నారు. తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం అసురన్ సినిమాకి రీమేక్ గా నారప్ప తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఈ రెండు చిత్రాల కథా కథనాలను గమనిస్తే, ఆపదలో ఉన్న తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక తండ్రి కొత్త ప్రదేశానికి (గ్రామానికి) మారడం రెండు సినిమాలలో ఒకటిగా కనిపించే అంశం అని నెటిజన్లు అంటున్నారు. అలాగే నారప్ప సినిమాలో కూడా శత్రువుల దాడిలో హీరో కొడుకుని చంపేస్తారు.
ఇక సినిమా క్లైమాక్స్‌లో మిగిలిన కుటుంబాన్ని కాపాడేందుకు హీరో శత్రువులతో పోరాడుతాడు. కొంతమంది నెటిజన్ల ప్రకారం అవతార్ 2 స్క్రీన్ ప్లే కూడా ఇదే విధంగా ఉంది.
కానీ ఇది ప్రేక్షకుల నుండి ఒక అత్యుత్సాహం వల్ల వచ్చిన ఒక అనవసరమైన పోలిక మాత్రమే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అవతార్ 2 చిత్రం మొదటి భాగం విడుదలైన తర్వాత 2009 లోనే రెండో భాగం స్క్రిప్ట్ కూడా వ్రాయబడింది.
కాబట్టి, 2019లో విడుదలైన వెట్రిమారన్ సినిమా నుండి జేమ్స్ కామెరూన్ స్ఫూర్తి పొందే అవకాశం లేదు. అవతార్ 2, నారప్ప కథ ఒకటే అని ఎవరైనా చెబితే అది ఖచ్చితంగా నవ్వు తెప్పిస్తుంది. మనం సారూప్యతలను గీయడం కొనసాగించినట్లయితే, ప్రతి చిత్రం ఏదో ఒక చిత్రం లాగానే కనిపిస్తుంది.
ఈ రోజుల్లో నెటిజన్లు ఒక సినిమా లోని సీన్లు, పాటలను మరో సినిమాతో ఏదో రకంగా పోల్చి చూసి కాపీ అనడం పరిపాటిగా మారింది.