తాజాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న కలిసి యాక్ట్ చేసిన హిస్టారికల్ యాక్షన్ మూవీ ఛావా. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఎంతో బాగా పెర్ఫామ్ చేస్తున్న విషయం తెలిసిందే. చత్రపతి శంభాజీ మహారాజ్ గా ఈ సినిమాలో విక్కీ కౌశల్ అత్యద్భుతమైన నటనకు అందరి నుంచి విశేషమైన ప్రశంసలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, యాక్షన్, ఎమోషన్ సీన్స్ కి అందరి నుంచి భారీగా స్పందన లభిస్తుంది. నిజానికి ఇటువంటి హిస్టారికల్ సినిమాలు గతంలో మన తెలుగులో కూడా వచ్చాయి కానీ అవి ఆశించిన స్థాయిలో విజయం అయితే అందుకోలేకపోయాయి.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన తొలితరం స్వతంత్ర సమరయోధుడి బయోపిక్ సైరా నరసింహారెడ్డి భారీ అంచనాలతో పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయింది. అయితే ఓవరాల్ గా కేవలం పరవాలేదనిపించే విజయం మాత్రమే అందుకుంది. అలానే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బయోపిక్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి కూడా యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుంది.
వీటితోపాటు లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన రుద్రమదేవి సినిమా కూడా మంచి అంచనాలతో రిలీజ్ అయి పరవాలేదనిపించే విజయం దగ్గర ఆగిపోయింది. ఓవరాల్ గా ఇటువంటి హిస్టారికల్ డ్రామాలు మన తెలుగులో ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయలేకపోయాయి.
కాగా ఇటువంటి హిస్టారికల్ బయోపిక్స్ రాబోయే రోజుల్లో మరిన్ని రావాలని అలానే అవి ఛావా మాదిరిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసేలా దర్శకులు వాటిని తెరకెక్కించాలని పలువురు ఆడియన్స్ తో పాటు సినీ విశ్లేషకులు కూడా కోరుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆ కల ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.