తెలుగు సినీ కార్మిక వేతనాల పై ఫెడరేషన్ ఏళ్ల తరబడి చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. గత కొంతకాలంగా సరైన నిర్ణయం తెలపని నిర్మాతలు దిగి వచ్చి జీతభత్యాల పెంపుకు వారి ఆమోదం తెలిపారు.
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో వాణిజ్య మండలి అధ్యక్షులు K. బసిరెడ్డి, గౌరవ కార్యదర్శి K.L. దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు C.కళ్యాణ్, గౌరవ కార్యదర్శి T. ప్రసన్న కుమార్, మరియు తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శిి అయిన కె. అనుపమ్ రెడ్డి, వీళ్ళందరితో పాటు ఇతర కమిటీ సభ్యులు మరియు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ P.S.N. దొర, కోశాధికారి సురేష్ లు పాల్గొన్న ఈ సమావేశంలో కార్మికుల వేతనాల పెంపు, మరియు వాటి విధి విధానాలన్నిటినీ ఖరారు చేశారు.
ఈ మేరకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) 2018 సంవత్సరంలో చేసిన ఒప్పందంను అనుసరించి.. కార్మికుల వేతనాలను పెద్ద సినిమాలకు 30 శాతం, చిన్న సినిమాలకు 15 శాతం పెంచేందుకు గానూ అంగీకరించారు. ఈ పెంచిన వేతనములు 01-07-2022 వ తేదీనుండి 30-06-2025 వరకు అమలులో ఉంటాయని, అలాగే ఏ సినిమా పెద్దది ఏ సినిమా చిన్నది అనే నిర్ణయం మాత్రం చలన చిత్ర వాణిజ్య మండలి మరియు ఎంప్లాయిస్ ఫెడరేషన్‌లతో కూడిన కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ 22 జూన్ నుంచి సమ్మె చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అసలు జరిగిందెంటంటే గత రెండేళ్లుగా సినిమా పరిశ్రమ కోవిడ్ కారణంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. అలాంటి నేపథ్యంలో ఇటీవలే పరిశ్రమ కాస్త కోలుకుంటోంది. అయితే సినిమాలో నటించే హీరోలకు మాత్రం కోట్ల రూపాయలు పారితోషికంగా ఇచ్చే నిర్మాతలు .. కష్టపడి పని చేసే 24 క్రాఫ్ట్ మెంబర్స్‌కు మాత్రం తగిన వేతనాన్ని ఇవ్వడం లేదంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు.
ఓ వైపు ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో కుటుంబాన్ని పోషించడం చాలా సమస్యగా మారిందని.. తమ జీతం పెంచాలని కార్మికులు చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. పలు మార్లు నిర్మాతలతో చర్చలు జరిగినా వాటి వల్ల ఏ ఉపయోగం లేకుండా పోయింది. ఇదే విషయం మీద కార్మికులు చాలాసార్లు బంద్ కూడా పాటించారు. కానీ వారి సమస్య పరిష్కారం కాలేదు. కానీ క్రిందటి సారి ఇచ్చిన సమ్మె నోటీసు పని చేసింది. సరైన నిర్ణయం తీసుకుంటాం అని నోటీసు సమయంలో హామీ ఇచ్చిన నిర్మాతలు.. ఇటీవల పరిశ్రమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపి నెల రోజుల పాటు షూటింగులు నిలిపివేసి అన్ని విషయాల పైనా కూలంకుశంగా చర్చించారు.
ఆ చర్చల పర్యవసానంలో ఎట్టకేలకు కార్మికుల వేతనాల పై నిర్మాతలు సానుకూల నిర్ణయం తీసుకోవడం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.