ప్రస్తుతం తెలుగు సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరియు ట్రేడ్ పండితులకు తెలుగు సినిమా బాక్సాఫీస్ ను అంచనా వేయడం అనూహ్యంగా మారింది. కొత్త టాలెంట్‌తో అంతగా పరిచయం లేని నటీనటులతో తెరకెక్కిన చిన్న బడ్జెట్ సినిమాలు మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. అయితే అనుభవజ్ఞులైన నటీనటులు మరియు సిబ్బందితో రూపొందిన సినిమాలు మాత్రం పరాజయం పాలవుతున్నాయి.
ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి తెలుగు బాక్సాఫీస్ పరిస్థితి ఇదే విధంగా ఉంది. ది ఘోస్ట్, థ్యాంక్యూ, ది వారియర్, జిన్నా, మాచర్ల నియోజకవర్గం, ఇట్లు మారేడుమిల్లి వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్రాష్ అయ్యాయి. కానీ జబర్దస్త్ సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన గాలోడు అలాగే హారర్ చిత్రంగా వచ్చిన మసుదాతో పాటు డబ్బింగ్ చిత్రాలైన కాంతార/లవ్ టుడే వంటి కొత్త ప్రతిభ కలిగిన చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి.
ముఖ్యంగా COVID-19 తర్వాత ప్రేక్షకుల అభిరుచి వేగంగా మారిపోయింది అనే చెప్పాలి. యూట్యూబ్ స్టార్‌లు నటించిన సినిమాలు మరియు లవ్ టుడే లాంటి కాంటెంపరరీ కంటెంట్‌కు యువత నుండి ఎక్కువ స్పందన వస్తోంది. ప్రవీణ్ సత్తారు లేదా విక్రమ్ కుమార్ వంటి ప్రముఖ దర్శకులు తెరకెక్కించిన సినిమాలు కూడా ప్రేక్షకుల పై ఏమాత్రం ప్రభావం చూపలేక పోవడం గమనార్హం.
నాగార్జున నటించగా దారుణ రీతిలో పరాజయం పాలైన ది ఘోస్ట్ విడుదలకు ముందు ట్రైలర్ చూస్తే ఇదొక అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్న సినిమా అనే భావన కలుగుతుంది. అయితే అంతలా ఆకర్షించే ట్రైలర్ ఉన్నా కూడా ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించడంలో ఆ సినిమా విఫలమయింది.
ప్రేక్షకులకి ఏ సినిమా నచ్చుతుందో లేదో తెలియని ఈ సందిగ్ధత ఇప్పుడు ఇండస్ట్రీని వెంటాడుతోంది. ఒకప్పటిలా మూస ధోరణిలో సినిమాలు తీస్తే.. తెలుగు ప్రేక్షకుల నుంచి తప్పకుండా ప్రతిఘటన ఉంటుంది. టైర్ 2 స్టార్‌లు మరియు టైర్ 3 స్టార్‌లు అలాంటి సినిమాలు చేస్తే అవి పెద్దగా ఆదరణ పొందడం లేదు. ఇక OTT విప్లవం కూడా సినిమా విజయాన్ని ప్రభావితం చేస్తున్న వాటిల్లో ఒకటి అని చెప్పవచ్చు.
ఇది ప్రస్తుతం సినిమాల జయాపజయాలతో ముడిపడిన వాటాదారులందరికీ పరివర్తన కలిగించే సమయం, అందువల్ల తెలుగు సినిమాని రక్షించడానికి ఏవైతే అవసరమైన మార్పులు ఉన్నాయో అవి తెలుసుకుని పరిశ్రమ మళ్ళీ ఒక సరైన బాటలో నడుస్తుందని ఆశిద్దాం.