దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ చరిత్రాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రాన్ని తీసిన దర్శకుడు కావచ్చు, నటించిన నటీనటులు, ఇతర తమిళ పరిశ్రమ వర్గాలు, ప్రముఖ విశ్లేషకులు అలాగే తమిళ ప్రేక్షకులు అందరూ పొన్నియిన్ సెల్వన్‌ని తమిళ సినిమా గర్వకారణంగా ప్రచారం చేసి భారీ స్థాయిలో ఈ సినిమా పై అంచనాలు పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం విడుదలైన దగ్గరనుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రేక్షకులు మరియు అభిమానులు ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఇది ఒక అద్భుతమైన సినిమాగా పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే సినిమా చూసి ఎలా ఉంది అని చెప్పే కంటే పొన్నియిన్ సెల్వన్‌ని ఒక పండగలా జరుపుకోవాలి అనే లక్ష్యంతో ఉన్నారు. వారి అభిమానికి ఈ చిత్ర బృందం నిజంగా సంతోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఈ చిత్రాన్ని చూసిన ఒక వర్గం తెలుగు ప్రేక్షకులు మాత్రం పొన్నియిన్ సెల్వన్‌ని ప్రభాస్ మరియు రానా దగ్గుబాటి నటించగా.. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో పోల్చారు. ఇది చాలా మంది తమిళ ప్రేక్షకులకు కోపం తెప్పించింది, దీంతో ట్విట్టర్‌లో PS-1ని బాహుబలితో పోల్చిన వ్యక్తుల పై వారు ట్వీట్ల ద్వారా యుద్ధం చేశారనే చెప్పాలి.
బాహుబలి ఒక ఫాంటసీ చిత్రం అని, పొన్నియిన్ సెల్వన్ చారిత్రక కల్పన అని, అలాంటపుడు ఈ రెండు చిత్రాలను ఎలా పోల్చి చూస్తారని వారు తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు రకరకాల ట్రోల్స్ కూడా చేసుకున్నారు.
తమిళ ప్రేక్షకుల తర్కించే విధానంలోనూ న్యాయం ఉంది. మణిరత్నం శైలి, రాజమౌళి శైలి పూర్తిగా వేరుగా ఉంటాయి. అలాంటప్పుడు మణిరత్నం సినిమాల్లో ఉన్నట్లు నెమ్మదిగా, చాలా సాధారణంగా డైలాగులు రాజమౌళి సినిమాల్లో కనిపించవు. అలాగే రాజమౌళి సినిమాల్లో ఉండే ఉర్రూతలూగించే సన్నివేశాలు మణిరత్నం సినిమాల్లో ఉండవు.
ఇలా పొన్నియిన్ సెల్వన్ విడుదలైన రోజే బాహుబలి ట్విట్టర్‌లో ట్రెండ్ అవడానికి కారణం ఒక రకంగా తెలుగు, తమిళ ఇరు వర్గాల ప్రేక్షకుల అత్యుత్సాహం ఒక కారణం అయితే మరో రకంగా చూసుకుంటే ఇలాంటి సినిమాలను తెరకెక్కించాలంటే రాజమౌళి మాత్రమే తీయగలడు అనేలా ఆయన బాహుబలి సీరీస్ తో ప్రేక్షకుల పై ముద్ర వేసిన విషయం స్పష్టం అవుతుంది.
ఇక ఈరోజు విడుదలైన పొన్నియిన్ సెల్వన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని అంటున్నారు.