ప్రపంచ వ్యాప్తంగా సినిమాలకు పైరసీ అనేది చాలా కాలంగా పెద్ద సమస్యగా ఉంది. హై క్వాలిటీ కంటెంట్ తో సినిమాలు లీక్ అవడం వ్యాపారాలకు హాని కలిగిస్తున్నాయి. నిర్మాతలు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా కానీ ఈ లీక్‌లు మాత్రం ఆగడం లేదు. తాజాగా అలాంటి ఘటనే కోలీవుడ్‌ను కుదిపేస్తోంది.
లవ్ టుడే అనే సినిమా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ కొనసాగిస్తుంది. అయితే ఈ సినిమా హెచ్‌డి ప్రింట్‌ను కొందరు దుండగులు ఆన్‌లైన్ లో లీక్ చేశారు. ఇది ఆందోళన కలిగించే విషయమే.
ఈ చిత్రం 2 వారాల్లో ఏకంగా 60 కోట్ల గ్రాస్ వసూలు చేసి డ్రీమ్ రన్ ను చూస్తుంది. ఇది ఒక కొత్త హీరోకి భారీ స్థాయి విజయమని చెప్పాలి. తెలుగు వెర్షన్‌ను కూడా నవంబర్ 25 నుండి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే, ఈ ఆన్లైన్ లీకేజ్ సినిమా బాక్సాఫీస్ రన్‌ను దెబ్బతీయవచ్చు. ఇది OTT యుగం, సినిమా కంటెంట్ ఆన్‌లైన్‌లో చాలా సులువుగా అందుబాటులో ఉంటే ఆన్‌లైన్‌లో చూడటానికే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు సినిమా భవితవ్యం ఏంటని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు.
ఇవానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. సత్యరాజ్ – రాధిక శరత్ కుమార్ – యోగి బాబు – రవీనా రవి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నేటి యువతరంలోని భావాలను ప్రతిబింబించే అంశాలతో ప్రదీప్ రూపొందించిన ఈ ‘లవ్ టుడే’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎస్వీసీ బ్యానర్ పై విడుదల కానుంది. ఇటీవల, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసి, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మరి తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.