తమిళ సూపర్ స్టార్ విజయ్ కి ఇటీవలే తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన కత్తి, తుపాకి సినిమాలే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మెల్లమెల్లగా తెలుగు రాష్ట్రాల్లో విజయ్ మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు. అయితే విజయ్ కు తెలుగులో ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఆయన తెలుగు రాష్ట్రాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కావడం లేదు.
ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలతో పోటీగా వారసుడు సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం విజయ్ తెలుగులో పాల్గొనలేదు. ఆ సినిమాకి తెలుగు దర్శకుడు, నిర్మాత పని చేసినా కూడా ఆయన సినిమాకి సంభందించిన ఏ కార్యక్రమానికీ హాజరు కాలేదు.
అగ్ర కథానాయకుడు అయి ఉండీ విజయ్ సినిమాను ప్రమోట్ చేయడంలో విఫలం కావడంతో వారసుడు ఫలితం కూడా యావరేజ్ వసూళ్లతో చాలా నిరాశపరిచింది. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో ధనుష్ తన తాజా చిత్ర ప్రచార కార్యక్రమాల కోసం హైదరాబాద్ వచ్చి సినిమా పై బజ్ క్రియేట్ చేసి తన వంతు ప్రయత్నం చేశారు.
ధనుష్ ను చూసి తెలుగు ఈవెంట్లకు రావడం విజయ్ కూడా మొదలు పెట్టాలని నెటిజన్లు అంటున్నారు. అలా చేస్తే ఖచ్చితంగా తన సినిమాలకు మరింత ఆదరణ పెరుగుతుందని వారి అభిప్రాయం.
ధనుష్ హీరోగా నటించగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం ‘వాతి/సార్’. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, సముద్రఖని, తనికెళ్ల భరణి, సాయికుమార్ కీలక పాత్రలు పోషించారు. జి.వి.ప్రకాష్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో ధనుష్ టీచర్ గా కనిపించనుండగా సముద్రఖని నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు.