బెల్లంకొండ గణేష్ తొలి చిత్రం ‘స్వాతి ముత్యం’ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చిరంజీవి యొక్క గాడ్ ఫాదర్ మరియు నాగార్జున యొక్క ది ఘోస్ట్ వంటి పెద్ద చిత్రాలతో పాటు విడుదల చేసిన కారణంగా వార్తల్లో నిలిచింది.
ఈ చిత్రం సమీక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంది మరియు ప్రేక్షకులు కూడా ఇది ఒక ఆరోగ్యకరమైన హాస్యం ఉన్న చిత్రం అని భావించారు. హాస్యం మరియు భావోద్వేగాల కలయికతో కూడిన ఉదాత్తమైన సందేశంతో తెరకెక్కిందీ చిత్రం. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. పెద్ద హీరోల సినిమాలతో పోటీగా రాకుండా వేరే తేదీలో విడుదల చేసి ఉంటే సినిమా విజయం సాధించి ఉండేదని సోషల్ మీడియాలో చాలా మంది, సినీ ప్రముఖులు కూడా భావించారు.
థియేటర్లలో కొద్ది రోజులు మాత్రమే నడిచిన స్వాతి ముత్యం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ ద్వారా ప్రేక్షకులను మరింత దగ్గరగా కలవడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ‘ఆహా’ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
బెల్లంకొండ గణేష్ నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు ఓటీటీ దిగ్గజం ప్రకటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ కథానాయికగా నటించారు.
స్వాతి ముత్యం బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) అనే ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగి యొక్క కథ గురించి చెబుతుంది. హాయిగా జీవనం సాగించే బాలుకి అతని తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి(వర్ష బొల్లమ్మ)తో పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. వారిద్దరూ కలుసుకుని ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడటం కూడా మొదలుపెడతారు. ఇక అంతా సవ్యంగా జరిగి వారు పెళ్లి చేసుకోబోతున్నప్పుడు, బాలు గతంలో జరిగిన ఒక సంఘటన పెళ్లిలో పెద్ద సమస్యను సృష్టిస్తుంది.
హీరో ఆ సమస్యని ఎలా పరిష్కరించి తన నిజాయితీని నిరూపించుకోవడంతో పాటు చివరకు తనకు నచ్చిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అనేది మిగతా కథ.