విక్రమ్ వేద వంటి అద్భుతమైన సినిమా తీసిన పుష్కర్ గాయత్రి ద్వయం రచించిన వెబ్ సీరీస్ “సుడల్ – The Vortex”. బ్రహ్మ, అనుచరణ్ లు దర్శకత్వం వహించగా,ఐశ్వర్య రాజేష్, పార్థిబన్, శ్రేయా రెడ్డి, కథిర్,హరీష్ ఉత్తమన్ తదితరులు నటించిన ఈ వెబ్ సీరీస్ ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది.
ఈ సీరీస్ కథ తమిళనాడులో జరుగుతుంది. సాంబలూరు అనే చిన్న గ్రామంలో సిమెంట్ ఫ్యాక్టరీ మీద అక్కడి జనాలు ఆదారపడి బతుకుతుంటారు. ఆ ఫ్యాక్టరీ ప్రారంభించిన సమయంలో అమ్మని అనే అమ్మాయి కనిపించకుండాపోతుంది. దాదాపు పాతికేళ్ల తరువాత ఫ్యాక్టరీ తగులబడుతుంది. ఆ రోజే నీల అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆ ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ షణ్ముఖం (పార్థిబన్) కూతురే నీల. అదే ఊర్లో సీఐ అయిన రెజీనా (శ్రియా రెడ్డి)కి, షణ్ముఖంకు ఒకరంటే ఒకరికి పడదు. ఇక ఫ్యాక్టరీ తగలబడి పోవడానికి కారణం షణ్ముఖం యే కారణం అని నింద పడగా, మరో వైపు నీల ఒకరోజు కనిపించకుండా పోతుంది. నీల అదృశ్యం వెనుక రెజీనా కొడుకు అతిశయం హస్తం ఉందా?,ఫ్యాక్టరీ తగలబడి పోవడం వెనుక అసలు రహస్యం ఎంటి? ఈ సంఘటనలతో అంకాలమ్మ జాతర మయన్ కొళ్లైకి సంబంధం ఏమైనా ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం పూర్తి వెబ్ సీరీస్ లో దొరుకుతుంది.
వెబ్ సీరీస్ మొదలైన కాసేపు మామూలుగానే ఉంటుంది, సినిమా కంటే వెబ్ సీరీస్ కి నిడివి విషయంలో కాస్త వెసులుబాటు ఉంటుంది కాబట్టి మొదటి ఎపిసోడ్ ల వరకు పాత్రల పరిచయం చేస్తూ కాస్త నెమ్మదిగానే సాగినా ఆ తరువాత అసలు విషయం వైపు కథనం పరుగులు తీస్తుంది.ఒక గ్రామంలో ఉండే వాతావరణాన్ని చాలా వరకు సహజంగా ఉండేలా చూసుకున్నారు ఈ సిరీస్ లో. ప్రారంభంలో ఇదేదో దృశ్యం సినిమాకి దగ్గరగా ఉన్న మరో థ్రిల్లర్ అనుకుంటాం కానీ చాలా తొందరగానే ఆ శైలి నుండి తనదైన బాణీలో వెళుతుంది ఈ సీరీస్ కథనం. ఎన్నో పాత్రలు ఒక్కో పాత్రకి ఒక్కో బలహీనత (flawed characters) ఆయా బలహీనతల వల్ల ఒక్కొక్కరి జీవితంలో తలెత్తిన సమస్యల్ని చాలా అర్థవంతంగా భావోద్వేగాలను కలిపి చూపించారు.ఒక్కో ట్విస్ట్ వస్తున్న కొద్దీ క్రమంగా ఆసక్తి పెరుగుతూ అసలు ఎలా అన్నిటినీ ఒక దగ్గరకి చేర్చి ముగిస్తారా అని చూసేలా చేయడంలో దర్శకులు సక్సెస్ అయ్యారు. ఒక్కో ఎపిసోడ్ దాదాపు యాభై నిమిషాలు లేదా గంట సమయం ఉన్నా ఎక్కడా పట్టు తప్పకుండా, వీక్షకులు ఆసక్తి తగ్గకుండా తీశారు.తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఎదుగుతున్న వయసులోనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్న యువత ఎలాంటి విషాదకరమైన సంఘటనలు ఎదురుకుంటారు అనే విషయాలను చక్కగా చూపించారు. అలాగే సమాజంలో మంచి వాళ్ళుగా, అమాయకులుగా నడుచుకునే వాళ్ళలో ఎవ్వరికీ తెలియని దుర్మార్గులు దాగి ఉంటారో, బాల్య వయసులో లైంగిక వేదింపుల వల్ల ఆమ్మాయిలు ఎలాంటి మానసిక సంఘర్షణకు గురవుతారు అనే అంశాలను ఆలోచింప చేసెలా తెరకెక్కించారు.పోలీస్ పాత్రధారి కథీర్ ద్వారా ఊరి గురించి, మనుషుల మధ్య వైరుధ్యం గూర్చి వచ్చే సంభాషణలు ప్రభావితం చేస్తాయి.
నటీనటుల్లో ఐశ్వర్య రాజేష్ మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకొగా, పోలీస్ గాకథిర్ కూడా ఆకట్టుకుంటాడు. శ్రేయా రెడీ చాలా రోజులకు కనిపిస్తుంది, పోలీస్ అధికారి పాత్రలో ఆవిడ కూడా బాగా చేసింది. ఇక పార్థిబన్ తన అనుభవంతో పాత్రను పోషించారు. హరీష్ ఉత్తమన్ పాత్రోచితంగా నటించారు. నివేదితా సతీష్ తదితరులు పర్వాలేదు.