2D ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన నిర్మాత రాజశేఖర్ పాండియన్, తమిళ స్టార్ హీరో సూర్య నటించగా విశేష స్థాయిలో ప్రశంసలు పొందిన చిత్రం జై భీమ్ సినిమాకు సీక్వెల్ దాదాపు ఖరారైనట్లే అని ధృవీకరించారు. సీక్వెల్ ప్లాన్ ఖచ్చితంగా ఉందని ధృవీకరిస్తూ, అయితే ప్రస్తుతం మాత్రం ఇది కేవలం ఆలోచన రూపంలోనే ఉందని, స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి చాలా సమయం పడుతుందని, మరియు సెట్స్ పైకి వెళ్లే ముందు స్క్రిప్ట్ లో ఉన్న అంశాల పై పూర్తి పరిశోధన కూడా అవసరమని రాజశేఖర్ చెప్పారు.
TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్, అణగారిన మరియు కుల ఆధారిత వివక్ష పై పోరాటం నేపథ్యంలో రూపొందిన కోర్టు రూం డ్రామా. ఈ చిత్రంలో సూర్య నిజజీవిత న్యాయవాది అయిన చంద్రు పాత్రలో కనిపించారు. కాగా ఆయన నిజ జీవితం ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా అణగారిన ప్రజల కోసం పోరాడటానికి తన జీవితాన్ని అంకితం చేశారు.
రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, సీక్వెల్ ప్రస్తుతం ప్లానింగ్ దశలో ఉందని ధృవీకరించారు, “అవును, నేను ఫిల్మ్ ఫెస్టివల్‌లో ధృవీకరించినట్లుగా జై భీమ్ 2 ఖచ్చితంగా జరుగుతుంది. మేము (2డి ఎంటర్‌టైన్‌మెంట్) తర్వాత టిజె జ్ఞానవేల్‌తో సినిమా చేస్తున్నాం – అయితే అది వేరే స్క్రిప్ట్. అతను ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాత, మేము జై భీం 2 కోసం పని చేస్తాము. ప్రస్తుతం, జై భీమ్ సీక్వెల్ ఆలోచన దశలో ఉంది. దీనికి చాలా తయారీ మరియు పరిశోధన అవసరం. ఇక జస్టిస్ చంద్రు గురించి చెప్పాల్సిన కథలు చాలానే ఉన్నాయి.” అని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకముందే, దర్శకుడు TJ జ్ఞానవేల్ 2D ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మరో చిత్రానికి పని చేయనున్నారు. జై భీమ్ చిత్రంలో లిజోమోల్ జోస్, మణికందన్, రజిషా విజయన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తదితరులు నటించారు. జై భీమ్ IFFI 53వ ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్స్ విభాగం క్రింద ప్రదర్శించబడింది.
సూర్య చివరిసారిగా కమల్ హాసన్ యొక్క విక్రమ్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించారు. ఈ చిత్రం ఈ సంవత్సరం వేసవిలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇటీవల, సూర్య విక్రమ్ సినిమా నుండి అత్యంత ప్రజాదరణ పొందిన రోలెక్స్ పాత్ర ఆధారంగా ఒక సినిమా చేసే అవకాశం గురించి కూడా మాట్లాడారు.
విక్రమ్ సినిమాలో డ్రగ్ లార్డ్ రోలెక్స్‌గా సూర్య అతిధి పాత్ర 1 నిమిషం పాటు మాత్రమే ఉన్నప్పటికీ, సినిమా యొక్క ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా నిలిచి ప్రేక్షకులచే బాగా ప్రశంసించబడింది. ఒకవేళ రోలెక్స్ పాత్ర పై ప్రత్యేక సినిమా తన వద్దకు వస్తే తప్పకుండా చేస్తానని సూర్య చెప్పారు.