దక్షిణ భారత సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో, ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ (PS-1) అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నెలాఖరున విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది.
అదేంటంటే.. పొన్నియిన్ సెల్వన్ సినిమా తాలూకు ఆడియో, ట్రైలర్ లాంచ్ సెప్టెంబర్ 6న జరగనుంది. భారీ స్థాయిలో అంగ రంగ వైభవంగా జరగనున్న వేడుకకి సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. ఈ చిత్రాన్ని మణిరత్నం తన కలల ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు.
కాగా పొన్నియన్ సెల్వన్ గ్రాండ్ రిలీజ్‌కి కొన్ని వారాల సమయం మాత్రమే ఉండటంతో, అభిమానులు మరియు ఇతర ప్రేక్షకులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ట్రైలర్ మరియు ఆడియో లాంచ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ (విశ్వనాయకుడు) కమల్ హాసన్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర ముఖ్య తారాగణం అయిన ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష తదితరులు కూడా హాజరు కానున్నారు.
భారీ స్థాయిలో జరగనున్న ఈ కార్యక్రమమంలో.. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ తన ఆర్కెస్ట్రాతో పాటలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీని తర్వాత ప్రముఖులు, నటీనటులు మరియు సిబ్బంది నుండి ప్రసంగాలు ఉంటాయి. ఈ సినిమా పట్ల తమిళ సినీ ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పొన్నియిన్ సెల్వన్ అనేది కల్కి కృష్ణమూర్తి రాసిన అదే పేరుతో ఉన్న ప్రసిద్ధ తమిళ సాహిత్య నవల ఆధారంగా రూపొందించబడిన చారిత్రాత్మక చిత్రం. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, త్రిష, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యలక్ష్మి, ప్రభు, శరత్‌కుమార్, ఆర్ పార్తిబన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ముందుగా చెప్పినట్లుగా పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా.. రెండో భాగం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.