సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న (SSMB28) తాజా సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ లో హైదరాబాద్ లో నాలుగు వేర్వేరు సెట్లలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తుంది. కాగా SSMB28 ప్రస్తుత షెడ్యూల్ ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగనుంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ నుంచి మహేష్ కు సంబంధించిన ఓ ఫోటో లీక్ కావడంతో నెటిజన్లు, అభిమానుల నుంచి ఆ లుక్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హెడ్ బ్యాండ్, చెక్ షర్ట్ ధరించిన ఈ మాస్ లుక్ మహేష్ అభిమానులను బాగా ఆకట్టుకుంది, ఇక చిత్ర బృందం నుండి తదుపరి అప్డేట్స్ కోసం వారు ఎంతో ఆత్రుతగా ఉన్నారు.
2023 ఆగస్టులో ఈ సినిమా విడుదల కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి తర్వాత మహేష్ సరసన పూజా హెగ్డే నటించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ ప్రాజెక్టులో శ్రీ లీల కూడా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా (SSMB28) చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఇక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇలా తమ అభిమాన హీరో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తుండటంతో ఎప్పుడెప్పుడు సినిమాలు చూస్తామా అని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.