సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాటకు ఇటీవలే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రదర్శించబడింది. కాగా ఈ చిత్రానికి వచ్చిన రేటింగ్‌లు అందరినీ తీవ్రంగా నిరాశపరిచాయనే చెప్పాలి. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే ఈ సినిమా మా టీవీలో ప్రసారం చేయబడింది.
అయితే అనూహ్యంగా సర్కారు వారి పాట సినిమా TRP 9.45 నమోదు చేసి ఇటీవలి కాలంలో అతి తక్కువ TRP లను తెచ్చుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. HD+SD 11.1 టిఆర్‌పిని అందించింది, ఇది మహేష్‌కు ఫ్యామిలీ ప్రేక్షకులలో ఉన్న ఆదరణను పరిగణలోకి తీసుకుంటే చాలా తక్కువ రేటింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
వేసవి కానుకగా మే 12న విడుదలైన సర్కారు వారి పాట చిత్రం తక్కువ తొలి రోజు చాలా సాధారణ సమీక్షలతో పాటు యావరేజ టాక్‌ను సంపాదించింది. అయినప్పటికీ కలెక్షన్లు బాగానే రాబట్టి ప్రపంచ వ్యాప్తంగా బాక్స్-ఆఫీస్ వద్ద 117.7 కోట్ల షేర్ వసూలు చేయగలిగింది. ఈ చిత్రానికి జరిగిన థియేట్రికల్ బిజినెస్ 119.5 కోట్లు.
టాక్ సరిగా రాకున్నా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో చేసిన వన్-మ్యాన్ షో వల్ల, ఆయనకున్న అపారమైన అభిమానుల వల్ల ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లలో రికార్డు సంఖ్యలను నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ప్రదర్శన కనబర్చింది. మహేష్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో (SSMB28) చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన తొలి షూటింగ్ షెడ్యూల్ ను చిత్ర బృందం పూర్తి చేసుకుంది.
ఇక అక్టోబర్ 10 నుంచి ఈ సినిమా షూటింగ్ తాలూకు రెండో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్‌ను కూడా నిర్మించారని సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్నారు. కాగా ఈ షెడ్యూల్‌లో వీరిద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాణ సంస్థ అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చనుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించనున్నారు.