తెలుగు సినిమా లెజెండరీ స్టార్లలో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు, నవంబర్ 15, 79 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణ అకాల మరణం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కృష్ణ కొడుకు అయిన మహేష్ బాబు, మరియు ఆయన కుటుంబ సభ్యులకు సోషల్ మీడియాలో ఎందరో అభిమానులు మరియు ప్రేక్షకులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
నవంబర్ 14న, కృష్ణకు గుండెపోటు వచ్చి అపస్మారక స్థితిలో తెల్లవారుజామున 2 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తరువాత, ఆయన సంరక్షణ కోసం అనేక మంది వైద్యులను ఉంచారు. మరియు వారు కృష్ణ గారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇచ్చారు.
ప్రియమైన వారందరినీ విడిచిపెట్టి ఈ దిగ్గజ నటుడు ఈరోజు ఉదయం కన్నుమూశారు. సూపర్‌స్టార్ కృష్ణను కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలు మరియు ఇతర సంబంధిత కార్యక్రమాల వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.
ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి అలియాస్ కృష్ణ ఘట్టమనేని రాఘవయ్య చౌదరి మరియు నాగరత్నమ్మ దంపతులకు మే 31, 1943న జన్మించారు. కృష్ణగా ప్రసిద్ధి చెందిన ఆయన ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేశారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో నటించారు. అభిమానులు ఆయన్ను ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు.
కృష్ణ గారు ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు. మరియు తరువాత విజయ నిర్మలను కూడా వివాహం చేసుకున్నారు. విజయ నిర్మల 2019లో మరణించగా, ఇందిర సెప్టెంబర్ 2022లో తుది శ్వాస విడిచారు. ఇక కృష్ణ గారు ఐదుగురు పిల్లలకు తండ్రి; రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. రమేష్ బాబు జనవరి 2022లో మరణించారు.
1961లో కుల గోత్రాలు అనే చిత్రంలో చిన్న పాత్రతో తన కెరీర్‌ను ప్రారంభించారు కృష్ణ. తర్వాతి రెండు సంవత్సరాల పాటు సహాయ పాత్రల్లో కనిపించడం కొనసాగించారు. 1965లో తేనే మనసులు సినిమాతో కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. రెండు సంవత్సరాల తరువాత, సాక్షి ఆయనకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని అందించింది మరియు ఈ చిత్రం తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఇక కృష్ణ పండంటి కాపురం సినిమా 1972లో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. అల్లూరి సీతారామ రాజు, సింహాసనం, గూడాచారి 116, జేమ్స్ బాండ్ 777, ముగ్గురు కొడుకులు మరియు అన్న తమ్ముడు మొదలైన సినిమాలు ఆయన సుదీర్ఘ కెరీర్ లో ఉత్తమ చిత్రాలుగా కీర్తించబడ్డాయి.
సినిమాలతో పాటు, కృష్ణ రాజకీయాల్లో కూడా భాగం అయ్యారు. మరియు 2012లో రాజకీయాలను విడిచిపెట్టారు. కృష్ణ గారు ఆ కాలంలో అత్యధిక పారితోషికం పొందిన నటులలో ఒకరుగా నిలిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.