యువ హీరో సందీప్ కిషన్ తన మొదటి సినిమా దర్శకుడు దేవా కట్టాతో మరోసారి చేతులు కలపబోతున్నారు. కాగా అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ ఇద్దరు అద్భుతమైన ప్రతిభావంతులు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే దీనికి సంభందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ప్రస్థానం సినిమాతో సందీప్ కిషన్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. శర్వానంద్, సాయికుమార్ నటనకు ఎన్నో మంచి ప్రశంసలు దక్కాయి.
ప్రస్థానం సినిమాలో సందీప్ కిషన్ నటనకు కూడా అద్భుతమైన స్పందన లభించడంతో ఈ సినిమా ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ప్రస్థానంలో సందీప్ హీరో తమ్ముడి పాత్రలో కనిపించినప్పటికీ ఈ కొత్త సినిమాలో మాత్రం ఆయనే ప్రధాన పాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.
సందీప్ కిషన్ తాజా చిత్రం మైఖేల్ తన కెరీర్ లోనే భారీ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే ఈ సినిమా థియేటర్లలో తక్కువ ఆక్యుపెన్సీతో మొదలవడంతో పాటు ప్రేక్షకుల స్పందన కూడా బాగోలేకపోవడంతో డిజాస్టర్ గా ముగిసింది.
ఇక మైఖేల్ సినిమాలో భారీ తారాగణం కనిపించింది. విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అయ్యప్ప పి.శర్మ తదితరులు ఈ.చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.