శింబు – గౌతమ్ మీనన్‌ల కాంబినేషన్లో వస్తున్న “వెండు తానింధాతు కాదు” సినిమా గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో లైఫ్ ఆఫ్ ముత్తు టైటిల్ తో విడుదల చేస్తున్నారు. కాగా ఈ సినిమా రెండు వెర్షన్లు కూడా సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదల కానున్నాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ప్రస్తుతం అన్ని సినిమా పరిశ్రమలలో ఫ్రాంచైజీ మరియు ప్యాన్ ఇండియా సినిమాల హవా బాగా నడుస్తోంది. అదే కోవలో లైఫ్ ఆఫ్ ముత్తు కూడా చేరింది. ఇక ఈ సినిమా మొదటి భాగాన్ని ‘ది కిండ్లింగ్’ అని పిలుస్తారట. ప్రముఖ తెలుగు సినిమా నిర్మాణ సంస్థ అయిన స్రవంతి మూవీస్ ఈ చిత్రాన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేయనుంది.
పన్నెండేళ్ళ క్రితం వచ్చిన క్లాసిక్ లవ్ స్టొరీ “విన్నైతాండి వరువాయ” చిత్రం నుంచి నటుడు శింబు మరియు దర్శకుడు గౌతమ్ మీనన్ ఎప్పుడూ ఒకరితో ఒకరు చక్కని స్నేహ బంధాన్ని పంచుకున్నారు. వీరిద్దరూ కలిసి “అచ్చం యేన్బాదు మదమైయ్యదా” అనే చిత్రాన్ని కూడా చేశారు. ఆ తర్వాత లాక్ డౌన్ టైంలో ఒక షార్ట్ ఫిల్మ్‌ను కూడా రూపొందించారు. ఇక ముచ్చటగా మూడోసారి జతకట్టిన శింబు-గౌతమ్.. ఈసారి తమ శైలికి భిన్నంగా ఉన్న సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
గౌతమ్ మీనన్ సినిమాల్లో ఇదివరకు మాఫియా డాన్ ల ప్రస్తావన ఉన్నప్పటికీ.. ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రను హీరోగా తెరకెక్కించడం ఇదే మొదటిసారి. అలాగే హీరో శింబు కూడా తన కెరీర్ లో ఇంతవరకు ఏ సినిమాలోనూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించలేదు. ఆయన కూడా గ్యాంగ్‌స్టర్‌గా కనిపించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రంలో యువకుడి పాత్రలో శింబు లుక్స్ ఆకట్టుకోగా.. అందుకోసం శింబు చాలా కష్టపడ్డారని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది. ఇక ఈ సినిమా అత్యున్నత స్థాయి విజువల్స్ తో పాటు ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా ఒక గ్యాంగ్‌స్టర్ మ్యూజికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఇదొక చక్కని ఎమోషన్స్ తో సాగే చిత్రమని, అలాగే ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొదటి భాగం అనుకున్న స్థాయిలో విజయవంతం అయితే రెండో భాగం కూడా తొందర్లోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
లైఫ్ ఆఫ్ ముత్తు సినిమాలో నీరజ్ మాధవ్, రాధిక శరత్‌కుమార్, సిద్ధి ఇద్నాని మరియు కయదు లోహర్ తదితరులు నటించారు. జయమోహన్ ఈ చిత్రానికి రచయితగా పని చేశారు.