గత డిసెంబర్ వరకు రవితేజ కాస్త బ్యాడ్ స్టేజ్ లో ఉన్నారు. 2022 లో ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి మరియు ఆయా చిత్రాలలో ఆయన నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కానీ ఒక్క నెలలోనే అంతా మారిపోయింది,ఇప్పుడు సూపర్బ్ కలెక్షన్స్ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడంతో పాటు తన నటనకు ప్రశంసలు కూడా అందుకుంటున్నారు రవితేజ.
ఆయన హీరోగా నటించిన ధమాకా సినిమాతో రవితేజ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ ఆయన ఎనర్జీ, డ్యాన్సులు చూపించడం మినహా ఈ సినిమాలో నటనకు పెద్దగా స్కోప్ లేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన రవితేజ ఇటీవలి రోజుల్లో తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.
రవితేజ పాత్ర సినిమాకి గుండెకాయలాంటిదని, తన కర్తవ్యానికి ఆయన నూటికి నూరు శాతం న్యాయం చేశారని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఆయనకు, చిరంజీవికి మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. కామెడీ మాత్రమే కాదు, ఎమోషనల్ సీన్స్ లోనూ రవితేజ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
రవితేజ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. బహుశా అందుకేనేమో వెండి తెర పై వీరిద్దరి బంధం చాలా రియల్ గా కనిపించి, వారి పాత్రల మధ్య సెంటిమెంట్ యాంగిల్ ను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేసింది.
ఇక ముందుగానే చెప్పుకున్నట్లు రవితేజ ధమాకాతో ఇటీవలే కమ్ బ్యాక్ ఇచ్చారు. కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పొజిషన్ కు చేరి బ్లాక్ బస్టర్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. దాదాపు 19 కోట్ల వరకు జరిగిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ను సునాయాసంగా దాటేసి మరోసారి కమర్షియల్ సినిమాల ఆధిపత్యాన్ని ధమాకా నమోదు చేసింది.
ధమాకా ఇప్పుడు ఓటీటీ అరంగేట్రానికి సిద్ధమవుతోంది. థియేట్రికల్ రిలీజ్ అయిన సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే జనవరి 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.