శుక్రవారం అనేది సినిమా ప్రేమికులకు పండుగ లాంటి రోజు. ఎందుకంటే చాలా సినిమాలు ఒకే రోజు విడుదలవుతాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్రభావం కూడా పెరిగింది. థియేటర్లో సినిమాను చూడలేకపోయిన వారు ఫలానా సినిమా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఒకే రోజు ఓటీటీలో ఆరు సినిమాలు విడుదల చేస్తే ఎలా ఉంటుంది? ఈ శుక్రవారం ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాలు ఏవో చూద్దాం.
సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద ఇటీవల విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 11 న విడుదలై డీసెంట్ హిట్ అయ్యింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో సమంత నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. యశోద చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
నితిన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఆగస్టు 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో అరంగేట్రం చేసింది. ఈ చిత్రం ఈ రోజు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆసక్తికరంగా, ఈ చిత్రం ఆహా వీడియో మరియు నెట్ ఫ్లిక్స్ కూడా అందుబాటులో ఉంది. వివాహం మంచిదా లేదా లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనే దాని గురించి ఈ చిత్రం ప్రస్తావిస్తుంది.
ఇక విట్నెస్, రాయ్, మరియు లైక్-షేర్-సబ్ స్క్రైబ్ సినిమాలు సోనీలైవ్ లో ప్రసారం అవుతున్నాయి. ఓటీటీ ఎంటర్టైన్మెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జీ 5 తమిళ చిత్రం కాఫీ విత్ కాదల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 9, 2022 అంటే ఈరోజు నుండి డిజిటల్ మాధ్యమంలో తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది.