దుల్కర్ సల్మాన్ హీరోగా, మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా.. రష్మిక మందన్నా కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ సీతారామం’. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అశ్వినీదత్ కూతురు స్వప్నదత్ నిర్మించారు. కాగా ఈ సినిమాకు మొదటి నుంచి చక్కని స్పందన తెచ్చుకుంది. ఆ పాజిటివ్ టాక్ అలా ఎదుగుతూ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రోజు రోజుకూ కలెక్షన్లను పెంచుకుంటూ పోతుంది.
ఇప్పటికే సీతారామం సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా దాదాపుగా హాఫ్ మిలియన్ డాలర్లను చేరుకోగా ఈ జోరు ఇంతటితో తగ్గకుండా 1 మిలియన్ డాలర్ల మ్యాజిక్ ఫిగర్ ను కూడా అందుకోబోతుందని అంచనా . ఇటీవలి కాలంలో ఒక మీడియం రేంజ్ సినిమా ఈ స్థాయి వసూళ్లు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.
మొదటి మూడు రోజుల వరకు సీతారామం చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 13 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో 6 కోట్లు, తమిళనాడు, కర్ణాటక, కేరళ మూడు రాష్ట్రాల్లోనూ కలిపి 6 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అంటే మొత్తంగా చెప్పాలంటే సీతారామం సినిమా అన్ని వెర్షన్లు కలిపి 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూళ్లు సాధించింది.
ఇక ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ ల నటనతో పాటు వారి మధ్య పండిన అద్భుతమైన కెమిస్ట్రీ సినిమా స్థాయిని అమాంతం పెంచింది అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. అలాగే సినిమా కథనాన్ని ముందుండి నడిపించే కీలక పాత్రలో రష్మిక మందన్నా కూడా ఆకట్టుకున్నారు. ఈ సినిమా కథ పై నమ్మకం ఉంచి చిత్ర బృందం పడిన కష్టం వృథా పోలేదు. వారి నమ్మకానికి ప్రతిరూపమే ఈ వసూళ్లు అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించినప్పటి నుంచే దుల్కర్ సల్మాన్ కు తెలుగు లో మంచి ప్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు సీతారామంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ ను చూసిన తర్వాత.. ఆయన అద్భుతమైన నటనకు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ చిత్రంతో వచ్చిన గుర్తింపు వల్ల హీరోగా దుల్కర్ సల్మాన్ ఇక పైన తెలుగు లో మరిన్ని సినిమాలు నేరుగా చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.