దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా నటించగా . హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకం పై నిర్మించిన “సీతా రామం” చిత్రం ఘన విజయం దిశగా పయనిస్తుంది.
ఒక క్లాసికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన సీతారామం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తొలిరోజు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభించింది. ఆ మౌత్ టాక్ ప్రభావం రెండో రోజు నుంచి అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది.
కాగా ఈ చిత్రం శనివారం దాదాపు అన్ని ఏరియాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు నమోదు చేయగా, చాలా ఏరియాల్లో అదనపు థియేటర్లు జోడించబడ్డాయి. మల్టీప్లెక్స్‌లు, ఎ సెంటర్లతో పాటు శనివారం బి, సి సెంటర్లలో కూడా ఈ సినిమా చాలా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఈరోజు ఆదివారం, ఈ చిత్రానికి కలెక్షన్ల పరంగా అత్యధిక వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇక US బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ప్రీమియర్స్ + డే 1 కంటే రెండవ రోజు ఎక్కువ వసూలు చేయడం మరో విశేషం. ఇప్పటికే $400K మార్కును చేరుకున్న సీతారామం ఈ రోజుతో హాఫ్ మిలియన్ డాలర్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరనుంది.
యధార్థ సంఘటనల ఆధారంగా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందించిన ఈ సినిమాని ప్రేక్షకులు మరియు విమర్శకులు ఎంతో ఇష్ట పడుతున్నారు. యుద్ధం రాసిన ప్రేమకథ అంటూ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో భావోద్వేగాలకు ప్రేక్షకులు ఎంతగానో ప్రభావితం అయ్యారు.
హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ లు వారి పాత్రల్లో ఎంతో చక్కగా నటించడమే కాకుండా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా పండించారు. ఇక దర్శకుడు హను రాఘవపూడి తనదైన పాత్ర చిత్రణలతో, ఫీల్ తో ఈ చిత్రాన్ని ఒక దృశ్య కావ్యంగా మలిచారు. కాగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం చిత్రానికి ప్రాణంగా నిలిచింది. పి.ఎస్.వినోద్ అద్భుతమైన విజువల్స్ ఎంతో ఆహ్లాదకరంగా ఉండి ఆకట్టుకున్నాయి.
ఇక నిర్మాణ విలువల పరంగా స్వప్న సినిమా – వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇలా అన్ని రకాల వనరులు ఈ సినిమాను ఒక అందమైన అనుభూతిని కలిగించే విధంగా నడిపించాయి.
అటు అద్భుతమైన రివ్యూలతో పాటు ఇటు కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తుంది.ఇటీవల మంచి ప్రచారంతో వచ్చిన పక్కా కమర్షియల్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాల కంటే సీతా రామం కలెక్షన్లు ఎక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్య పరిచింది. తెలుగు హీరో కాకుండా ఒక మలయాళ హీరో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడం ఎంతో అభినందనీయం.