కోలీవుడ్ స్టార్ హీరో శింబు తాజాగా నటించిన వెండు తనింధతు కాడు (VTK) సినిమా ఘన విజయం సాధించింది. కాగా మానాడు సినిమా తర్వాత అతనికి ఇది వరుసగా రెండవ విజయం కావడం విశేషం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన VTK చిత్రాన్ని తెలుగులో లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో విడుదల చేశారు. పల్లెటూరు నుంచి వచ్చిన ఒక సాధారణ యువకుడు అనుకోని పరిస్థితుల్లో మాఫియా గ్యాంగ్ ల గొడవల్లో ఎలా ఇరుక్కున్నాడు, ఆ తరువాత ఒక డాన్ గా ఎలా ఎదిగాడు అనే అంశాలతో ఈ చిత్రం రూపొందింది.
ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కాగా ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతం చిత్ర విజయానికి ఎంతో దోహదపడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడిన తర్వాత, వెండు తనింధతు కాడు చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌కు విడుదలకు సిద్ధమయింది. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడుతోంది. మరియు ఇప్పటికే ఈ చిత్రానికి నెటిజన్ల నుండి కూడా అద్భుతమైన స్పందన వస్తుంది.

శింబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సిద్ధి ఇదానీ హీరోయిన్ గా నటించగా, రాధిక శరత్‌కుమార్ మరియు సిద్ధిక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ధనుష్ నటించిన గత చిత్రం ఎనై నొక్కి పాయుం తూటా ( తెలుగులో తూటా) చిత్రంతో తన పై ప్రేక్షకులు ఏర్పరచుకునే భారీ అంచనాలను చేరుకోవడంలో విఫలమైన గౌతమ్ మీనన్.. ఈ చిత్రంతో మాత్రం ఆ అంచనాలను అందుకుని ఘనవిజయంతో బలమైన పునరాగమనాన్ని అందుకున్నారు.
ఇక గతేడాది విడుదలైన ‘మానాడు’ తర్వాత శింబుకి ఈ చిత్రంతో భారీ ఓపెనింగ్స్ దక్కాయి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన మానాడు చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతే కాక భారతదేశం నలుమూలల నుండి ఇతర సినీ పరిశ్రమల నిర్మాతలు మానాడు రీమేక్ హక్కుల కోసం ఎగబడ్డారు.
ఇక వెండు తనింధతు కాడు చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇషారి.కె. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై గణేష్ ఈ భారీ ఫ్రాన్చైజీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా రెండో భాగం వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.