ఈ సంక్రాంతికి విడుదలైన రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్ కథానాయికగా నటించారు. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాల్లో నటించడం ద్వారా మళ్లీ లైమ్ లైట్ లోకి రావడానికి తనకు మంచి అవకాశం లభించిందని ఆమె భావించి ఉండవచ్చు.
అయితే ఈ రెండు సినిమాల్లో తన పాత్రకు, సన్నివేశాలకు వస్తున్న రెస్పాన్స్ తో ఆమె నిరాశ చెందుతారు అనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల సినిమాలో శృతి హాసన్ ఉన్న సన్నివేశాలు మైనస్ పాయింట్ అని విమర్శకులు, ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో లీడ్ పెయిర్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడానికి చాలా కీలకంగా ఉంటాయి, అలాగే పాటలు కూడా మంచి రిలీఫ్ ఇస్తాయి. అయితే ఈ సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాల్లో లీడ్ పెయిర్ సరిగా కనిపించకపోవడంతో పాటు ఆ సీన్స్ కూడా ప్రేక్షకులకు బోరింగ్ ఫీల్ ను ఇచ్చాయి.
కనీసం వాల్తేరు వీరయ్యలో శ్రుతిహాసన్ పాత్రకు కథ పరంగా కొంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఓకే అనుకోవచ్చు కానీ వీరసింహారెడ్డిలో మాత్రం శ్రుతిహాసన్ సీన్స్ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి. ఆ సన్నివేశాలను ఎవరూ ఆస్వాదించలేకపోయారు. ప్రేక్షకులు అయా సన్నివేశాల పై చిరాకుపడి ఆమె సన్నివేశాలు సినిమా వేగాన్ని చంపేశాయని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే ప్రమోషన్స్ లో శృతిహాసన్ ఈ రెండు సినిమాల్లో తన పాత్రల పై చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. మీ పాత్రల మధ్య పోలిక ఉంటుందా అని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, రెండూ ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయని ఆమె చెప్పారు.
”రెండు సినిమాల్లోని కథలతో పాటు నా పాత్రలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. వీరసింహారెడ్డిలో నా పాత్రకు ఫన్ టచ్ ఉంది. వాల్తేరు వీరయ్యలో నా పాత్ర పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది” అని శ్రుతిహాసన్ అన్నారు.