కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం శివ వేద ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా కన్నడ వెర్షన్ వేద ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ అయింది. ఫిబ్రవరి 9న తెలుగులో విడుదల కానున్న ఈ సినిమా పై మంచి బజ్ ఉంది.
ఈ కార్యక్రమంలో భాగంగా శివరాజ్ కుమార్ సోదరుడు.. ఇటీవలే స్వర్గస్తులైన పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు తెచ్చుకుంటూ నివాళి వీడియోను ప్రదర్శించగా, ఆ వీడియోను చూసిన శివరాజ్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు.
2021 అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఆయన మరణానంతరం కర్ణాటక రత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు మరియు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న 10 వ గ్రహీత గా నిలిచారు.
ఇక ఈవెంట్ లోఈ చిత్రం గురించి శివరాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ చిత్రంలో వినోదం, యాక్షన్, సందేశం వంటి అన్ని అంశాలు ఉన్నందున తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగా లేనప్పటికీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తన కుటుంబం, బాలయ్య కుటుంబం ఒక్కటేనని, తారకరత్న త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నానని శివరాజ్ కుమార్ పేర్కొన్నారు. అంతకు ముందు బెంగళూరులోని ఆసుపత్రిలో ఉన్న నటుడిని శివరాజ్ కుమార్ పరామర్శించారు.
ఇక శివ వేద చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన బాలకృష్ణ, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. శివరాజ్ కుమార్, తాను అన్నదమ్ముల్లా ఉంటామని తామంతా ఒకే కుటుంబం అని ఆయన అన్నారు. బాలయ్య ఈ సినిమా విజయం పై నమ్మకం ఉంచి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుందని ఆశించారు. అలాగే పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ ఆయన ఎప్పటికీ అందరి హృదయాల్లో ఉంటారని పేర్కొన్నారు.