శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు 2, ఆర్ సి 15 చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. భారీ విజువలైజేషన్స్, గ్రాండ్ యాక్షన్, సాంగ్ సీక్వెన్స్ లకు పెట్టింది పేరుగా నిలిచిన ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ రెండు చిత్రాల్లోనూ ఇవన్నీ ఉంటాయని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు.
భారతీయుడు 2, ఆర్ సి 15 చిత్రాలను ఏకకాలంలో తెరకెక్కిస్తున్న శంకర్ ఈ రెండు భారీ ప్రాజెక్టులను ఒకేసారి ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలని అటు సినీ ప్రేమికులతో పాటు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఆ ఆసక్తి కాస్త సన్నగిల్లె విధంగా ఈ సినిమాల షూటింగ్ సాగడం అందరినీ నిరాశకు గురి చేసింది.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది దీపావళికి ‘భారతీయుడు 2’ను విడుదల చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారట. తాజా షూటింగ్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం దక్షిణాఫ్రికాకు పయనమవుతోంది. ఇక 2024 సంక్రాంతికి ఆర్ సి 15 విడుదల కానుండగా, ఈ నెలాఖరులో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నారు.
నిజానికి ఆర్ సి 15 కంటే ముందే భారతీయుడు 2 ప్రారంభమైనప్పటికీ, సెట్స్ లో సిబ్బంది మరణించడం మరియు కమల్ హాసన్, శంకర్ లకు న్యాయపరమైన సమస్యలతో సహా అనేక కారణాల వల్ల షూటింగ్ కు అడ్డంకులు ఎదురయ్యాయి.
మరో వైపు ఆర్ సి 15 మంచి వేగంతో వెళుతూ కొన్ని షూటింగ్ షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. కానీ, ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులతో శంకర్ భాగం కావడం వలన అది రామ్ చరణ్ సినిమా షూటింగ్ పై కూడా ప్రభావం చూపింది.