ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ మరియు కేతిరి సుధాకర్ రెడ్డి నటించిన చిన్న బడ్జెట్ చిత్రం బలగం బాక్సాఫీస్ వద్ద చాలా బాగా ఆడింది మరియు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం అప్పటి నుంచి ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు, ఈ చిత్ర నిర్మాతలు రెండు ఓటీటీ ప్లాట్ ఫారంలతో విడుదల ఒప్పందాన్ని కూడా పొందినట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ మరియు సింప్లీ సౌత్ ప్లాట్ ఫారంలలో ప్రసారానికి అందుబాటులోకి రానుందని సమాచారం.
ఈ చిత్రం విడుదలతో, హాస్యనటుడు వేణు యెల్దండి టాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అయితే, ఆయన తన దర్శకత్వ ప్రయత్నాన్ని ప్రకటించినప్పుడు, తనని దర్శకుడి పాత్రలో చూడటానికి చాలా మంది ఒప్పుకోలేదు. అయితే సినిమా విజయంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు వేణు యెల్దండి.
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గ్రామీణ కుటుంబ విషాదం నేపథ్యంలో తెరకెక్కిన బలగం ఒక కుటుంబ పెద్దాయన మరణం తర్వాత అతని కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి చర్యలకు పాల్పడ్డారు అనే దాని చుట్టూ తిరుగుతుంది.
ఈ చిత్రంలోని ఇతర తారాగణంలో కోట జయరామ్, కొమ్ము సుజాత, మురళీధర్ ఇరేని, అరుసం మధుసూధన్, ఆస్ని మనస్విని గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా, ఆచార్య వేణు సినిమాటోగ్రఫీని అందించారు.
వాస్తవానికి, బలగం థియేటర్‌లలో విడుదలైన 3 వారాలకే ఓటీటీ లోకి వచ్చేస్తుందని తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోయారు. బహుశా ఈ చిత్ర నిర్మాతలు విడుదలకు ముందే ఓటీటీ కోసం 3 వారాల ఒప్పందం పై సంతకం చేసి ఉండవచ్చు. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఈ సినిమా ఇప్పటికీ భారీ వసూళ్లతో రన్ అవుతోంది.